ఈ పుట ఆమోదించబడ్డది

450

ఒక యోగి ఆత్మకథ

భోగంలో మిగిలిపోయిన స్వల్పాంశాల్ని మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండా చేసుకోడానికి, కాలం కలిసివచ్చే సాధనంగా ఇప్పటి దేహాన్నే ఉపయోగించుకుని, భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిచ్చేవారు.

ఆ తరవాత కొన్ని నెలలకి, సనందుడనే మా పాత స్నేహితుణ్ణి కలుసుకున్నాను; ప్రణవానందగారి సన్నిహిత శిష్యుల్లో ఒక డతను.

“మా పూజ్య గురుదేవులు వెళ్ళిపోయారు,” అంటూ ఏడుస్తూ చెప్పాడు. “ఆయన ఋషీకేశం దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి, మాకు ప్రీతిగా శిక్షణ ఇచ్చారు. మేము చక్కగా కుదుటబడి ఆయన సన్నిధిలో త్వరత్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషీకేశం నుంచి పెద్ద జనసమూహాన్ని పిలిచి సంతర్పణ చెయ్యాలని తీర్మానించారు. అంత ఎక్కువమంది ఎందుకని నే నాయన్ని అడిగాను.

“ ‘ఇదే నా చివరి పండుగ వేడుక,’ అన్నారాయన. ఆయన మాటల్లో అంతరార్థాలు నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు.”

భారీ ఎత్తున వంటలు చేయటానికి ప్రణవానందగారు సాయపడ్డారు. 2,000 మందికి సంతర్పణ చేశాం. సంతర్పణ ముగిసిన తరవాత ఆయన ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద కూర్చుని అనంత పరబ్రహ్మను గురించి ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. అది ముగిసిన తరవాత, అన్ని వేలమంది సమక్షంలో, ఆయన నావేపు తిరిగారు; నేను వేదికమీద ఆయన పక్కనే కూర్చున్నాను. అసాధారణ పటిమతో నాతో ఇలా అన్నారు :

“ ‘సనందన్, సిద్ధంగా ఉండు ఈ చట్రాన్ని తన్నేస్తున్నాను,’ ”[1]

  1. అంటే, శరీరాన్ని విడిచిపెట్టడం.