ఈ పుట ఆమోదించబడ్డది

446

ఒక యోగి ఆత్మకథ

గోచరించే ఆలంఘ్యమయిన మరణకుడ్యాన్ని మాత్రమే దర్శిస్తాడు. కాని ఇతరుల్ని ఈశ్వరుడి అభివ్యక్తులుగా ప్రేమించే నిస్సంగుడు, తన ప్రేమ పాత్రులు మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పరిల్లడానికి వీలుగా ఈశ్వరానందం పొందడానికి మాత్రమే తిరిగి వెళ్ళారని అర్థం చేసుకుంటాడు.

రాంచీ విద్యాలయం, చిన్నగా నిరాడంబరంగా మొదలయినదల్లా ఇప్పుడు బీహారులోనూ బెంగాలులోనూ సుప్రసిద్ధమైన సంస్థగా అభివృద్ధి చెందింది. విద్యాలయశాఖ లనేకం, ఋషుల విద్యాబోధనాదర్శాల్ని పరిరక్షించడంలో ఆనందం పొందేవాళ్ళు అందించిన స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తున్నాయి. మిడ్నపూర్ లోనూ లక్ష్మణపూర్ లోనూ శాఖావిద్యాలయాలు స్థాపించడం జరిగింది; అవి బాగా వర్ధిల్లుతున్నాయి.

రాంచీ కేంద్రకార్య స్థానం, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ సహాయం కోసం వైద్యాలయం ఒకటి నిర్వహిస్తోంది. ఆటల పోటీల్లో కూడా విద్యాలయం పేరు తెచ్చుకుంది. ఇక విద్యారంగంలో, చాలామంది రాంచీ పట్టభద్రులు, ఆ తరవాతి విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు.

గత మూడు దశాబ్దుల్లోనూ తూర్పుదేశాల నుంచీ పడమటి దేశాల నుంచీ కూడా ప్రఖ్యాత స్త్రీపురుషులు అనేకమంది వచ్చి ఈ విద్యాలయాన్ని సందర్శించడం దీనికొక గౌరవం. కాశీలో ఉండే “రెండు శరీరాల సాధువు” స్వామి ప్రణవానందగారు 1918 లో రాంచీ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. చెట్లకింద నడిచే తరగతుల కమనీయ దృశ్యాన్ని తిలకిస్తున్నప్పుడూ, సంజెవేళ చిన్నచిన్న కుర్రవాళ్ళు యోగధ్యానంలో నిశ్చలంగా కూర్చుని ఉండడం గమనించినప్పుడూ ఆయన గాఢంగా చలించారు.