ఈ పుట ఆమోదించబడ్డది

440

ఒక యోగి ఆత్మకథ

పిల్లలకు సరయిన విద్య నేర్పాలన్న ఆదర్శం నా కెప్పుడూ ప్రియమైన విషయమే. కేవలం శరీరాన్నీ బుద్ధినీ అభివృద్ధిచెయ్యడానికి ఉద్దేశించిన మామూలు విద్యాబోధనకు వస్తున్న శుష్కఫలితాల్ని నేను స్పష్టంగా చూస్తూనే వచ్చాను. నైతిక, ఆధ్యాత్మిక విలువల్ని గ్రహించక పోయినట్లయితే ఎవ్వరూ సంతోషాన్ని పొందలేరు; అయినప్పటికీ నియత విద్యాప్రణాళికల్లో అవి లేవు. కుర్రవాళ్ళ సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఆశయ సాధనకు నేను చేసిన మొదటి పని, బెంగాలు గ్రామీణ ప్రాంతంలో దిహికా అనే చోట ఏడుగురు పిల్లలతో విద్యాలయం ప్రారంభించడం.

మరో ఏడాదికి, 1918 లో, కాసిం బజార్ మహారాజు సర్ మణీంద్రచంద్ర నందిగారి చలవవల్ల , శీఘ్రవృద్ధి చెందుతున్న మా విద్యార్థి బృందాన్ని రాంచీకి తరలించగలిగాను. కలకత్తాకు సుమారు రెండువందల మైళ్ళ దూరంలో, బీహారులో ఉన్న ఈ పట్నం, భారతదేశంలోని అత్యంత ఆరోగ్యప్రదమైన వాతావరణం గల ప్రదేశాల్లో ఒకటి. రాంచీలో ఉన్న కాసిం బజార్ రాజభవనం, కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం అయింది; ఈ విద్యాలయానికి నేను ‘యోగదా సత్సంగ బ్రహ్మచర్యా విద్యాలయం’[1] అని పేరు పెట్టాను.

  1. విద్యాలయం అంటే బడి. బ్రహ్మచర్యం అన్నదిక్కడ, వైదిక ప్రణాళికతో మానవ జీవితానికి నిర్ణయించిన నాలుగు దశల్లోనూ ఒకటి. ఆ నాలుగూ ఇవి: (1) బ్రహ్మచారిదశ; (2) లౌకిక బాధ్యతలు వహించే గృహస్థ దశ; (3) వానప్రస్థ దశ; (4) లౌకిక బంధాలు ఏమీ లేకుండా వనవాసం చేస్తూకాని, సంచారం చేస్తూకాని గడిపే సన్యాసి దశ. ఆదర్శవంతమైన ఈ జీవిత ప్రణాళికను ఆధునిక భారతదేశంలో విరివిగా పాటించనప్పటికీ, ఇప్పటికీ దీన్ని నిష్టగా పాటించేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ నాలుగు ఆశ్రమాల్నీ నిష్ఠగా, ఒక గురువు యావజ్జీవిత మార్గదర్శకత్వం కింద గడుపుతూ ఉంటారు.