ఈ పుట ఆమోదించబడ్డది

420

ఒక యోగి ఆత్మకథ

మానసిక శారీరక ప్రక్రియ. మెదడులోనూ వెనుబాములోనూ ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి, ఈ అదనపు ఆక్సిజన్ అణువులు, ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుషరక్తం జమ కాకుండా ఆపి, యోగి కణజాలాల క్షయాల్ని తగ్గించడంకాని ఆపెయ్యడం కాని చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి, తన శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు. ఎలిజా, ఏసు, కబీరు, ఇతర ప్రవక్తలూ, క్రియాయోగాన్నో ఆ మాదిరి మరో ప్రక్రియనో ఉపయోగించడంలో ప్రవీణులైన పూర్వులు; దాంతో వారు, తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షమూ చేసేవారు, అదృశ్యమూ చేసేవారు.

క్రియాయోగం సనాతనమైన శాస్త్రం. లాహిరీ మహాశయులు దాన్ని మహాగురుదేవులైన బాబాజీ దగ్గరినించి పొందారు. ఇది అంధయుగాల్లో మరుగున పడిపోయిన తరవాత, బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి సులభగ్రాహ్యం చేశారు. బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు.

“ఈ పందొమ్మిదో శతాబ్దంలో నేను నీద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం, కొన్ని వేల ఏళ్ళ కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ క్రీస్తుకూ, సెంట్ జాన్‌కూ సెంట్ పాల్‌కూ తదితర శిష్యులకూ తెలిసిఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే,” అన్నారు బాబాజీ.

భగవద్గీతలో కృష్ణభగవానుడు క్రియాయోగాన్ని రెండుసార్లు ప్రస్తావించాడు. ఒక శ్లోకంలో ఇలా ఉంది: “పీల్చేగాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చేగాలిలో వేల్చి, రెండు శ్వాసల్నీ తటస్థీకరిస్తున్నాడు యోగి; ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండెనుంచి విడుదల