ఈ పుట ఆమోదించబడ్డది

24

ఒక యోగి ఆత్మకథ

“ఇప్పుడు బయల్దేరకపోతే, తరవాత మిమ్మల్ని మీరు క్షమించుకో లేరు.” నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది, “నేనూ మిమ్మల్ని ఎన్నడూ క్షమించను!”

విషాదపూర్ణమైన ఆ ఉదయం, స్పష్టమైన కబురు తెచ్చింది: “అమ్మకి జబ్బుచేసి ప్రమాదస్థితిలో ఉంది; పెళ్ళి వాయిదా పడింది; వెంటనే వచ్చెయ్యండి.”

మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారేచోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒకాయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మావేపు వస్తోంది. మొదట చిన్నగా కనిపించినదే రానురాను పెద్దదవుతూ వచ్చింది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా, చటుక్కున రైలుపట్టాల కడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల, ఆవిడలేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు, అమ్మ ఒక్కర్తే అన్నంతగా ప్రేమించాను నేను. చిన్నతనంలో నా కెదురైన చిన్నచిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకొన్న ఆవిడ నల్లటి కళ్ళే.

“అమ్మ ఇంకా బతికుందా!” మామయ్యని, ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడంకోసం ఆగాను.

నా ముఖంలో ఉన్న నిరాశని అర్థంచేసుకోడానికి అట్టేసేపు పట్ట లేదాయనకి. “లేకేం? బతికే ఉంది!” అన్నారు. కాని ఆయన మాట, ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను.

మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం, దిగ్ర్భాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించడానికే అయింది. నేను కుప్పలా కూలి