ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

397

“మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమి ర్నతేజో న వాయుః
చిదానందరూపః శివో౽హం శివో౽హం.

న మృత్యు ర్నశంకా న మే జాతిభేదః
పితానైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివో౽హం శివో౽హం.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రి యాణాం
న చాసంగతం నైవ ముక్తి ర్నమేయః
చిదానందరూపః శివో౽హం శివో౽హం.”

ప్రతి స్వామీ, భారతదేశంలో చిరంతన కాలంగా మన్ననలందుకుంటూ వస్తున్న సన్యాస మఠామ్నాయానికి చెంది ఉంటాడు. కొన్ని శతాబ్దాల కిందట శంకరాచార్యులవారు దీన్ని పునర్వ్యవస్థీకరించి [మఠామ్నాయ మహానుశాసనం] ఇప్పుడున్న రీతిలోకి మార్చారు. ఆనాటినించి ఋషితుల్యులైన మఠాథిపతుల అవిచ్ఛిన్న పరంపర (వారిలో ప్రతి ఒక్కరికీ పరంపరాగతంగా ‘జగద్గురు శంకరాచార్య’ అనే బిరుదు ఉంటుంది)[1] దీనికి ఆధిపత్యం వహిస్తూ వస్తోంది. ఈ సన్యాస మఠామ్నా

  1. పూరీలో ఉన్న సనాతనమైన గోవర్ధన మఠానికి అధిపతులు, కీ. శే. జగద్గురు శంకరాచార్యులవారు, పూజ్యపాదులు భారతీకృష్ణ తీర్థులు 1958 లో మూడు నెల్లపాటు అమెరికా సందర్శించారు. శంకరాచార్యులలో ఒకరు పాశ్చాత్య దేశాల్లో సంచారం చెయ్యడమన్నది ఇదే మొదలు. చారిత్రక ప్రాముఖ్యం వహించే ఆయన యాత్రను ప్రోత్సహించిన సంస్థలు పరమహంస యోగానందులు స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. జగద్గురువులు అమెరికాలో ప్రముఖమైన విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేశారు. ప్రఖ్యాత చారిత్రకుడు, డా॥ ఆర్నాల్డ్ టాయిన్బీతో ప్రపంచశాంతిని గురించి ఏర్పాటు చేసిన చర్చలో పాల్గొన్నారు.

    1959 లో పూరీ శంకరాచార్యులు, యోగదా సత్సంగ స్వాములిద్దరికి సన్యాసదీక్ష ఇవ్వడంలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ గురువుల ప్రతినిధిగా వ్యవహరించమని కోరుతూ అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు. పూరీలో యోగదా సత్సంగ ఆశ్రమంలో ఉన్న శ్రీయుక్తేశ్వర మందిరంలో ఈ దీక్ష నిర్వహించారు. (ప్రచురణకర్త గమనిక).