ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

395

లోతట్టు బాల్కనీలో గురుదేవులు, తెల్లటి ఒక కొత్త పట్టుబట్టను కాషాయ వన్నె అద్దకం రంగులో ముంచారు; సన్యాసులు కట్టుకొనే బట్టలకు సాంప్రదాయికంగా వాడే వన్నె ఇది. బట్ట ఆరిన తరవాత, సన్యాసి పరిధానంగా, గురుదేవులు దాన్ని నాకు కప్పారు.

“ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకి వెళ్తావు, అక్కడి వాళ్ళు పట్టును పసందు చేస్తారు,” అన్నారాయన. “అందువల్ల మామూలుగా అందరూ కట్టుకొనే నూలుబట్టకు బదులు, ఒక గుర్తుగా, నీకోసం పట్టుబట్ట ఎంపిక చేశాను.”

భారతదేశంలో సన్యాసులు పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి అవుపించడం అరుదు. అయితే చాలా మంది యోగులు పట్టుబట్టలు కట్టుకోడానికి కారణం, అది నూలుబట్టకన్న ఎక్కువగా, శరీరంలోని కొన్ని సూక్ష్మ (విద్యుత్) ప్రవాహాల్ని సంరక్షించగలిగి ఉండడమే.

“తతంగాలు నాకు కిట్టవు,” అన్నారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “విద్వత్ (కర్మకాండలేని) రీతిలో నీకు సన్యాసదీక్ష ఇస్తాను.”

‘వివిదిష’ అనే సాంగోపాంగ సన్యాసదీక్షలో అగ్ని కార్యం కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయి. శిష్యుడి భౌతికకాయం మరణించినట్టూ దాన్ని జ్ఞానజ్వాలలో దహనం చేసినట్టూ పరిగణిస్తారు. కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం ఉపదేశిస్తారు; ఉదాహరణకు: “ఈ ఆత్మ బ్రహ్మ” [అయ మాత్మా బ్రహ్మ][1] అనికాని, “నువ్వే అది” [తత్త్వమసి] అనికాని,

  1. అంటే, “ఈ ఆత్మ పరబ్రహ్మ” అని అర్థం. ఈ పరబ్రహ్మ ఒకరు సృష్టించినది కాదు; పూర్తిగా నిర్విశేషమైనది. (‘నేతి, నేతి’: ఇదికాదు, ఇదికాదు). కాని వేదాంతంలో దీన్ని తరచుగా, ‘సత్ - చిత్ - ఆనందం’గా పేర్కొంటారు.