ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 24

నేను సన్యాసం తీసుకోడం

“గురుదేవా, నేను బెంగాల్ - నాగపూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్న గారు ఆత్రంగా ఉన్నారు. కాని నేను, వద్దని కచ్చితంగా చెప్పేశాను,” అంటూ నేను, “స్వామీ, మీరు నాకు సన్యాసదీక్ష ఇయ్యరా?” అని ఆశగా అర్థిస్తూ, మా గురుదేవులవేపు చూశాను. వెనకటి సంవత్సరాల్లో నేను ఇదే కోరిక కోరినప్పుడు ఆయన, నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించడానికి, దాన్ని నిరాకరించారు. అయితే ఈనాడు, కరుణార్ద్ర దృష్టితో చిరునవ్వు నవ్వారు.

“మంచిది, రేపే నీకు సన్యాసదీక్ష ఇస్తాను,” అంటూ ప్రశాంతంగా ఇంకా ఇలా అన్నారు, “నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు దేవుణ్ణి నీ వేసవి (పడుచుతనం) అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే, నీ జీవితపు చలికాలం (ముసలితనం)లో ఆయన నీ దగ్గరికి రాడు,” అని తరచుగా అనేవారు లాహిరీ మహాశయులు.

“ప్రియ గురుదేవా, పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను ఎన్నడూ విడిచిపెట్టలేను.” అపారమైన అభిమానంతో ఆయనవేపు చూసి చిరునవ్వు నవ్వాను.

“పెళ్ళికానివాడు దైవసంబంధమయినవాటికోసం ఆరాటపడుతాడు; ఆయన్ని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడు; కాని పెళ్ళయిన