ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 23

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

“నువ్వు నీ తత్త్వశాస్త్ర పాఠ్యగ్రంథాలు చదవడం నిర్లక్ష్యం చేస్తున్నావు. పరీక్షల్లో గట్టెక్కడానికి అనాయాసమయిన అంతఃప్రేరణ మీద ఆధారపడుతున్నట్టుంది. కాని నువ్వు కనక, ఒక విద్యార్థిమాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తాను.”

శ్రీరాంపూర్ కాలేజిలో ప్రొఫెసర్ డి. పి. ఘోషాల్‌గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలివి. ఆయన, తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షలో కనక నేను తప్పినట్లయితే చిట్టచివరి పరీక్షలకు కూర్చోడానికి నేను అనర్హుణ్ణి అవుతాను. ఈ నియమాలు ఏర్పరచింది కలకత్తా విశ్వవిద్యాలయ విద్యావిభాగం; దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజి ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బి. ఏ. చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో పాసవకపోయినా, ఆ మరుసటి సంవత్సరం మొత్తం ‘అన్ని’ సబ్జెక్టుల్లోనూ పరీక్షకు కూర్చోవాలి.

శ్రీరాంపూర్ కాలేజీలో మా అధ్యాపకులు మామూలుగా నన్ను దయతో చూసేవారు; అయితే దాంట్లో రవంత పరిహాసం కూడా లేకపోలేదు, “ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తెక్కి ఉన్నాడు.” అని తేల్చి పారేస్తూ, తరగతి గదిలో వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ప్రయత్నించే ఇబ్బంది కూడా నాకు లేకుండా చేసేవారు. చివరి రాతపరీక్షలు నన్ను బి. ఏ. పరీక్షార్థుల పట్టికలోంచి