ఈ పుట ఆమోదించబడ్డది

రాతిబొమ్మ గుండె

373

పదార్థాల్లోకీ చొచ్చుకుపోతుంది; ప్రతి చోటా దివ్యనేత్రమే కేంద్రం; దాని కెక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఈ ముంగిట్లో నించుని ఉండగా నే నొక విషయం కొత్తగా గ్రహించాను; వాస్తవానికి స్వప్నమై, నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్టసంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయన వాదమే శరణ్యమయినట్లయితే, సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా?

దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయమూ అమ్మవారి విగ్రహమూ, తక్కిన వాటిలో ప్రతి ఒక్కటీ తెలుపూ నీలమూ ఇంద్ర ధనుస్సులోని రంగులూ గల స్నిగ్ధ కాంతి పరివేషంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయుపదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది. నా భౌతిక పరిసరాల సంపూర్ణ స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ, ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను.

గుడి గోడల వెనక పవిత్రమైన మారేడుచెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను. ఆయన ఆలోచనల ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో, దక్షిణశ్వర పవిత్ర వాతావరణ ప్రభావంవల్ల కొంతమట్టుకు ఉదాత్తస్థితి నందుకున్నప్పటికీ నా గురించి నిర్ధాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా, ఆ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం వేపు తిరిగాను.