ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 21

మేము కాశ్మీరు వెళ్ళాం

“ఇప్పడు నీకు ప్రయాణం చెయ్యడానికి తగ్గంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీరు వస్తాను,” అన్నాడు శ్రీయుక్తేశ్వర్‌గారు; ఏషియాటిక్ కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న రెండు రోజుల తరవాత.

ఆ రోజు సాయంత్రం మా జట్టు ఆరుగురం కలిసి ఉత్తరదేశానికి వెళ్ళే బండి ఎక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా; హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగరరాణి ఇది. అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాం.

“ఇంగ్లీషు స్ట్రాబెరీలున్నాయి,” అని అరుస్తూ ఒక ముసలామె, అందమైన ఆరుబయటి అంగడి వీథిలో కూర్చుని ఉంది.

చిత్రమైన ఆ చిన్నచిన్న ఎర్రటి పళ్ళమీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక బుట్టెడు పళ్ళు కొని, పక్కనున్న నాకూ కనాయికీ పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేలమీద ఉమ్మేశాను.

“పులుపు రొడ్డండి సార్! స్ట్రాబెరీలు నాకు ఒక్కనాటికి నచ్చవు?”

మా గురుదేవులు నవ్వారు. “ఆఁహాఁ, నీకు నచ్చుతాయవి - అమెరికాలో. అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు, నీకు ఆతిథ్యమిచ్చే ఆవిడ, వాటిలో పంచదారా మీగడావేసి ఇస్తుంది. ఆ పళ్ళని