ఈ పుట ఆమోదించబడ్డది

348

ఒక యోగి ఆత్మకథ

అన్న పద్యం [“సింగి అద్దంకి పోనేపోయింది, రానే వచ్చింది” అన్నట్టు] చదివాను.

గురుదేవులు గదిలోకి వచ్చారు. ఖాయిలాచేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో, ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను.

“గురూజీ, నా పన్నెండో ఏట మొదలు, చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను. కాని సాగలేదు. చివరికి, మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి[1] నను చేరనివ్వదని నమ్మకం కుదిరింది!”

  1. “పర్వత సంబంధమైనది” అన్నది శబ్దార్థం. పురాణాల్లో, పార్వతీదేవిని హిమాలయ పర్వతరాజు (హిమవంతుడు) కూతురిగా వర్ణించడం జరిగింది. ఆయన నివాసం, టిబెట్టు సరిహద్దులో ఉన్న ఒకానొక శిఖరం. చేరడానికి శక్యంకాని ఆ శిఖరానికి దిగువున సాగే ప్రయాణికులు, దూరంగా మంచుతో ఏర్పడ్డ గుమ్మటాలూ బురుజులతో ఒక పెద్ద రాజప్రసాదం మాదిరిగా కనిపించే మంచు కొండలూ చూసి విస్మయానందభరితులవుతారు. పార్వతి, కాళి, దుర్గ, ఉమ, తదితర దేవతలు జగన్మాత భిన్న స్వరూపాలు; ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ఒక్కొక్క నామసంకేతం ఏర్పడింది. దేవుడు లేదా శివుడు తన పరా ప్రకృతి అయిన అతీతస్థితి కారణంగా సృష్టికార్య విషయంలో క్రియారహితుడయి ఉంటాడు. ఆయన తన శక్తి (క్రియాశీల శక్తి)ని తన “సతు”లకు అప్పగించడం జరిగింది; బ్రహ్మాండంలో అనంతమైన వివరాలు అభివ్యక్తమయేటట్టు చేసేవారు. ఈ సృజనాత్మక “నారీ” శక్తులే. హిమాలయాలు శివుడికి నివాసస్థానమని చెబుతాయి పురాణ గాథలు. హిమాలయాల్లో పుట్టిన నదులకు అధిష్ఠాత్రిగా, గంగాదేవి దివినుంచి భువికి దిగింది. అందువల్లే గంగ స్వర్గంనుంచి దిగివచ్చి, “యోగీశ్వరేశ్వరుడు” త్రిమూర్తుల్లో సృష్టి సంహార స్థితికర్త అయిన శివుడి జటాజూటం ద్వారా భూమికి అవతరించిందని కావ్యాల్లో చెబుతారు. “భారతీయులకు షేక్‌స్పియర్” వంటి మహాకవి కాళిదాసు, హిమాలయాల్ని “పరమశివుడి అట్టహాసరూపం”గా అభివర్ణించాడు. ‘ది లెగసీ ఆఫ్ ఇండియా’ (భారతదేశ వారసత్వం; ఆక్స్‌ఫర్డ్స్) అనే గ్రంథంలో ఎఫ్. డబ్ల్యు. థామస్ ఇలా రాస్తాడు: “శివుడి తెల్లటి పలువరసను పాఠకుడు ఎలాగో ఊహించుకోగలగవచ్చు; కాని, అతడు, ఉత్తుంగ శిఖరాయమానమైన పర్వతలోకాన్ని అధిష్టించిన పరమేశ్వర స్వరూపాన్నీ, దివినుంచి దిగివచ్చిన గంగ ఉరకలువేస్తున్న శివజటాజూటాన్నీ, ఆపైనున్న సిగపువ్వు మాదిరి చంద్రబింబాన్ని అనుభూతం చేసుకుంటేనే తప్ప ఆయన్ని సంపూర్ణంగా అవగాహనచేసుకోలేడు.” హిందూ చిత్రకళలో తరచుగా, నల్లటి జింకచర్మం కట్టుకున్నట్టుగా శివుణ్ణి చిత్రిస్తూండడం కద్దు. రాత్రిపూట చీకటికి, అగోచరతకూ అది ప్రతీక. ఆ ‘దిగంబరుడు’ ధరించే ఏకైక వస్త్రం అదే. తనకున్నది ఏదీ లేకుండా, అన్నీ తనవే అయిన ఈశ్వరుడి గౌరవార్థం, శైవశాఖీయుల్లో కొందరు ఒంటిమీద ఏమీ ధరించకుండానే ఉంటారు.

    కాశ్మీరులో విలసిల్లిన సాధుకోటిలో, 14వ శతాబ్దిలో జీవించిన లల్లా యోగీశ్వరి ఒకతె. ఆ శివభక్తురాలు దిగంబరి. ఆవిడ సమకాలికుల్లో సంశయాళు వొకడు, ఆవిడ దిగంబరిగా ఉండడానికి కారణమేమిటని అడిగాడు. ‘ఎందుకుండగూడదు? నా కిక్కడ మగవాళ్ళెవళ్ళూ కనిపించడం లేదు,’ అంటూ వాడిగా జవాబిచ్చిందావిడ. కొద్దిగా తీవ్రమైన ఆవిడ ఆలోచనాదృష్టిలో, ఈశ్వరానుభూతి లేనివాడు “మగవాడు” అని అనిపించుకోడానికి అర్హుడు కాదన్నమాట. ఆవిడ క్రియాయోగానికి సన్నిహితమైన యోగవిద్య ఒకటి సాధనచేసింది. ముక్తిని ప్రసాదించడంలో దానికి గల శక్తిని ఆవిడ అనేక పద్యాల్లో ప్రస్తుతించింది... వాటిలో ఒకదాన్ని ఇక్కడ అనువదిస్తాను.

    ఏ దుఃఖహాలాహలం తాగలేదు నేను?
    చావుపుట్టుకల చక్రగతులెన్నెన్నో నావి.
    అహో, అమృతంతో నిండింది నా పాత్ర
    శ్వాసప్రక్రియా సాధన ఫలాన్ని పొంది.

    ఆవిడ మానవసహజమైన మరణానికి గురికాకుండా, తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. తరవాత, శోకతప్తులైన పురజనుల ముందు బంగారు దుస్తులు ధరించి సజీవంగా ప్రత్యక్షమైంది. చిట్టచివరికి ఒంటినిండా బట్టకట్టుకొని!