ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళలేదు

343

“బిహారి దాదాపు అరగంట క్రితం, వెనకవేపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు,” అని చెప్పా డొకాయన. రవ్వంత చిరునవ్వు ఆయన పెదవులమీద తొణికిసలాడింది.

అక్కణ్ణించి దిగాలుపడి వస్తూ, బిహారిని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా, లేకపోతే గురుదేవులు అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అని తర్కించుకున్నాను. క్రిస్టియన్ చర్చి దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను; ఆయన నావేపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు:

“అయితే బిహారి రాడన్నమాట! మరిప్పుడు నీ ప్రయత్న మేమిటి?” అదుపాజ్ఞలు పెట్టే తండ్రిని ధిక్కరించడానికి నిశ్చయించుకున్న మొండి పిల్లవాడిలా మొరాయించింది నా మనస్సు. “మా బాబయ్యని, తన దగ్గర పనిచేసే లాల్‌ధారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి.”

“కావాలంటే మీ బాబయ్యని కలుసుకో,” అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు, ముసిముసిగా నవ్వుతూ. “కాని వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నా కనిపించడం లేదు.”

ఆ మాటకు నేను కీడు శంకించినా, నాలో తిరుగుబాటుతనం తలఎత్తింది; గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్‌లో అడుగు పెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంటు ప్లీడరు. ఆయన నన్ను ఆప్యాయంగా చేరదీశాడు.

“ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీరుకు బయల్దేరుతున్నాను.” అని చెప్పాను. “ఈ హిమాలయ యాత్రకోసం ఎన్నో ఏళ్ళనుంచి ఎదురు చూస్తున్నాను.” అన్నాను.