ఈ పుట ఆమోదించబడ్డది

334

ఒక యోగి ఆత్మకథ

గాఢమైన అవసరాల్ని తీర్చలేవు; ఎందువల్లనంటే, మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీయుక్తేశ్వర్‌గారి మాటలవల్ల దిజేన్‌కు, అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్న మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది.

నేనూ దిజేన్, ఇద్దరమూ శ్రీరాంపూర్ కాలేజిలో బి. ఏ. కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసివెళ్ళే అలవాటు అయింది మాకు. మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీయుక్తేశ్వర్‌గారు ఆశ్రమం రెండో అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచు చూసే వాళ్ళం.

ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి, ఆశ్రమవాసుల్లో కనాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి, నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు.

“గురుదేవులు ఇక్కడ లేరు; అర్జంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది.”

మర్నాడు గురుదేవుల దగ్గర్నించి నాకో పోస్టుకార్డు వచ్చింది. “నేను బుధవారం పొద్దున కలకత్తాలో బయల్దేరుతున్నాను. నువ్వూ దిజేనూ పొద్దున తొమ్మిది గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్‌కి వచ్చి కలుసుకోండి,” అని రాశారు.

బుధవారం పొద్దున సుమారు ఎనిమిదిన్నరకు శ్రీయుక్తేశ్వర్‌గారి దగ్గర్నించి మానసిక సందేశం ఒకటి నా మనస్సులో పదేపదే మెరిసింది; “నా కిక్కడ ఆలస్యమయింది; తొమ్మిదిగంటల బండికి రాకండి.”