ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లిం గారడివాడు

331

“నే నదేమీ పట్టించుకోకపోవడంవల్ల, ఆయన హఠాత్తుగా గట్టిగా ఉరిమాడు; దుర్బల శరీరుడు అంత గట్టిగా అరవడం విడ్డూరమే అనిపించింది.”

“ ‘గుర్తు పట్టలేదా నన్ను?’ ”

“నోట మాటలేకుండా నిలబడిపోయాను. దుర్బలుడైన ఈ ముసలి కుంటివాడు, చాలా చాలా సంవత్సరాల కిందట నాకు యోగవిద్య ఉపదేశించిన మహాయోగే కాని మరొకడు కాడని, తరుణం మించిపోయాక గుర్తించినందుకు నిశ్చేష్టుణ్ణి అయాను. ఆయన నిటారుగా నిలబడ్డారు. తక్షణమే ఆయన శరీరం మంచి దృఢంగా, పడుచుతనంతో నిండినట్టు పొడగట్టింది.

“నా గురుదేవుల చూపులు నిప్పులు కక్కుతున్నాయి. ‘నువ్వు నీ శక్తుల్ని పీడిత ప్రజలకు సాయపడ్డానికి కాకుండా, మామూలు దొంగలా వాటిమీద బతుకుతూ దుర్వినియోగం చెయ్యడం నా కళ్ళతోనే చూశాను! ఇక నీ శక్తులన్నిటినీ ఉపసంహరిస్తున్నాను; హజరత్ ఇప్పుడు నీ దగ్గర్నించి విడుదలయిపోయాడు. ఇంక నువ్వంటే బెంగాలుకు భయం ఉండదు.”

“నేను ఉద్విగ్న స్వరంతో హజరత్‌ను పిలిచాను; మొట్టమొదటి సారిగా, అతడు నా అంతర్దృష్టికి గోచరించడం మానేశాడు. కాని హఠాత్తుగా ఒక నల్లటి ముసుగు తొలగిపోయింది; నా పాపిష్టి జీవితం స్పష్టంగా కళ్ళకు కట్టింది.

“ ‘గురుదేవా, చాలా కాలంగా నాలో ఉన్న భ్రాంతిని తొలగించడానికి ఇలా వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను.’ ఆయన, కాళ్ళమీద పడి ఏడ్చేశాను. ‘లౌకికమైన నా అభిలాషలన్నీ విడిచిపెట్టేస్తా