ఈ పుట ఆమోదించబడ్డది

330

ఒక యోగి ఆత్మకథ

పత్రికలో అచ్చయింది; నాకది చూపిద్దామని తీసుకువచ్చాడు. అఫ్జల్ చిన్నతనంలో ఒక హిందూ గురువుదగ్గర ఉపదేశం పొందాడని చెప్పానే, ఆ విషయాలు దాంట్లోనే తెలిశాయి.

ఆ పత్రికాప్రకటనలో చివరి భాగం సారాంశం, శ్రీయుక్తేశ్వర్ గారికి గుర్తుకు వచ్చిన ప్రకారం ఇలా ఉంది: "అఫ్జల్‌ఖాన్ అనే నేను, పశ్చాత్తాప ప్రకటనగానూ, అలౌకికమైన అద్భుత చర్యలు చేసే శక్తులు సంపాదించాలని చూసేవాళ్ళకి ఒక హెచ్చరికగానూ ఈ ముక్కలు రాస్తున్నాను. దేవుడి దయవల్లా, మా గురుదేవుల దయవల్లా నాకు సంక్రమించిన అద్భుత శక్తుల్ని చాలా ఏళ్ళపాటు నేను దుర్వినియోగం చేస్తూ వచ్చాను. అహంకారంతో మదించాను; సాధారణ నీతినియమాలకు నేను అతీతుణ్ణని భావించాను, కాని చివరికి నా అంతిమ న్యాయనిర్ధారణ రోజు దగ్గరపడింది.

“ఈమధ్య కలకత్తా అవతల ఒక రోడ్డుమీద ఒక ముసలాయన తారసపడ్డాడు. ఆయన బాధగా కుంటుతూ నడుస్తున్నాడు; ఆయన చేతిలో బంగారంలాంటి దేదో మిలమిలా మెరుస్తోంది. నా మనస్సులో లోభం తల ఎత్తింది; ఆయనతో ఇలా అన్నాను:

“ ‘నేను అఫ్జల్‌ఖాన్ అనే గొప్ప ఫకీర్ని. నీ చేతిలో ఉన్నదేమిటి?’ ”

“నాకున్న వస్తుసంపద అల్లా ఈ బంగారం గుండు ఒక్కటే; ఇది ఫకీరు కెందుకూ పనికి రాదు. అయ్యా, నా కుంటితనం పోగొట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.’ ”

“నేను ఆ గుండు తాకి, జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ ముసలాయన కుంటుకుంటూ నా వెంట పడ్డాడు. కాసేపట్లో, ‘నా బంగారం పోయింది బాబోయ్!’ అంటూ అరవడం మొదలు పెట్టాడు.