ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లిం గారడివాడు

323

పడ్డ ఒక హిందూ యోగి ద్వారా అసాధారణమైన శక్తులు సంపాదించా డతను.

“ ‘నాయనా, దాహంగా ఉంది; కాసిని మంచినీళ్ళు తెచ్చి పెట్టు.’ దుమ్ముకొట్టుకుపోయి ఉన్న ఓ సన్యాసి ఒకనాడు అప్జల్‌ను ఇలా కోరాడు. తూర్పు బెంగాలులో ఒక కుగ్రామంలో జరిగిందిది. అప్పటికి అప్జల్ చిన్న కుర్రవాడు.

“ ‘స్వామీ, నేను ముస్లిమును. మీరు హిందువులై ఉండి, నా చేత్తో ఇచ్చే నీళ్ళు ఎలా తాగుతారు?’ ”

“ ‘నీ సత్యసంధత నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది నాయనా! అంటరాని తనం లాంటి పాపిష్ఠి సంకుచిత నియమాల్ని నేను పాటించను. వెళ్ళు, తొందరగా నీళ్ళు తీసుకురా.’ ”

“అప్జల్ భక్తి శ్రద్ధలకు ఆ యోగి వాత్సల్య దృక్కులు కానుక లయాయి.

“ ‘వెనకటి జన్మల్లో నువ్వు సత్కర్మలు చేశావు.’ అన్నాడాయన గంభీరంగా. ‘నీకు నే నొక యోగప్రక్రియ నేర్పుతాను. దాని ద్వారా నీకు, అగోచర మండలాల్లో ఒకదాని మీద అధికారం చిక్కుతుంది. ఆ మహత్తర శక్తుల్ని నువ్వు సదుద్దేశ్యాలకే వినియోగించాలి, స్వార్థ బుద్ధితో మాత్రం ఎన్నడూ వినియోగించకు సుమా! విచారకరమైన విషయం ఒకటి ఏమిటంటే, పూర్వజన్మల నుంచి నువ్వు విధ్వంసక ధోరణులనే విత్తనాలు కొన్ని వెంట తెచ్చుకున్నావు. సరికొత్త పాడు పనులనే నీళ్ళు పోసి ఆ విత్తనాలు మొలకెత్తేలా మాత్రం చెయ్యకు. జటిలమైన నీ పూర్వకర్మానుసారంగా, నువ్వీ జన్మలో యోగసాధన ఫలితాల్ని శ్రేష్ఠమైన మానవాభ్యుదయ లక్ష్యాలకే వినియోగించవలసి ఉంది.’