ఈ పుట ఆమోదించబడ్డది

320

ఒక యోగి ఆత్మకథ

సారించారు. “ఇప్పుడు నువ్వు రైళ్ళలో గంటలకొద్దీ గడపవలసిన అవసరం ఉండదు. నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో! బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చెయ్యడం తగ్గించి సరైన విద్యార్థివవుతా వనుకుంటాను.”

కాని ఎంచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది.[1]

  1. శ్రీయుక్తేశ్వర్‌గారు, చాలామంది ఋషులలాగే, ఆధునిక విద్యలోని భౌతికవాద ధోరణిని విచారించేవారు. సంతోషం కోసం ఆధ్యాత్మిక నియమాల్ని ప్రబోధించడం కాని, ‘దేవుడి మీది భయం’తో- అంటే సృష్టికర్త పట్ల భయ భక్తులతో- జీవితం సాగించడంలోనే జ్ఞానం ఉందని బోధించడంకాని చేసే విద్యాలయాలు చాలా తక్కువ. మానవుడు కేవలం “ఉన్నత స్థాయి జంతువు” అంటూ ఈనాడు కళాశాలల్లోనూ ఉన్నత పాఠశాలల్లోనూ చెప్పగా వినే కుర్రవాళ్ళు తరచు నాస్తికులవుతూ ఉంటారు. వాళ్ళు ఆత్మశోధన ఏమీ చెయ్యరు; తమ మూలప్రకృతిని “దేవుడి ప్రతిరూపం”గా పరిగణించరు. ఎమర్సన్ ఇలా అన్నాడు: “మన లోపం ఏముందో అదే బయట చూడగలుగుతాం. మనకు దేవుళ్ళెవరూ తటస్థ పడడం లేదంటే, మన మెవర్నీ ఆశ్రయించకపోవడమే దానికి కారణం.” తన పశుప్రకృతి ఒక్కటే వాస్తవంగా భావించేవాడు దివ్యాభిలాషలకు దూరమవుతాడు. మానవ అస్తిత్వానికి పరమాత్మను కేంద్ర బిందువుగా చూపని విద్యావ్యవస్థ ‘అవిద్య’ నేర్పుతున్నట్టే. అంటే మిథ్యాజ్ఞానాన్ని బోధిస్తున్నట్టే లెక్క. “నేను సంపన్నుణ్ణి అనీ, వస్తుసంపాదనతో అభివృద్ధికి వచ్చాననీ, నా కింకేదీ అవసరం లేదనీ అంటావు నువ్వు. కాని నీకు తెలియదు. నువ్వు వట్టి దిక్కుమాలిన వాడివనీ, దౌర్భాగ్యుడవనీ, దరిద్రుడివనీ, గుడ్డివాడివనీ, దిగంబరుడివనీ.” (రివలేషన్ 3-17).

    ప్రాచీన భారతదేశంలో కుర్రవాళ్ళ విద్యాభ్యాసం ఆదర్శవంతంగా ఉండేది. తొమ్మిదేళ్ళ వయస్సులో విద్యార్థిని గురుకులం (గురువుల కుటుంబ నివాసమే విద్యాలయం) లో “పుత్రుడిగా” చేర్చుకునేవారు. “ఈ కాలపు కుర్రవాడు తన కున్న టైములో (ఏడాదికి) ఎనిమిదోవంతు మాత్రమే పాఠశాలలో గడుపుతాడు; కాని భారతీయుడు అన్ని వేళలా అక్కడే గడుపుతాడు,” అని రాస్తారు ప్రొఫెసర్ ఎస్. వి. వెంకటేశ్వర , ‘ఇండియన్ కల్చర్ త్రూ ఏజెస్’ (సంపుటి 1; లాంగ్మన్స్ గ్రీన్ అండ్ కంపెనీ) అన్న గ్రంథంలో. “ఆ రోజుల్లో ఐకమత్యమూ బాధ్యతతో కూడిన ఆరోగ్యకరమైన అనుభూతి ఉండేది; స్వావలంబన, వ్యక్తిత్వ వికాసాల సాధనకు సంపూర్ణావకాశం ఉంటుండేది. అత్యుత్తమ సంస్కారం, తనకు తానుగా విధించుకొన్న క్రమశిక్షణ, విధివిధేయత, నిస్స్వార్థకృషి, త్యాగ బుద్ధి, ఆత్మగౌరవం, ఇతరుల మీద గౌరవం ఉంటుండేవి. ఉన్నత ప్రమాణంలో విద్యాసంబంధమైన హుందాతనం, ఔదార్య స్పృహ, మానవ జీవిత పరమార్థ దృష్టి ఉండేవి”