ఈ పుట ఆమోదించబడ్డది

316

ఒక యోగి ఆత్మకథ

"నీ ఇష్టం― తాగినా సరే, పారబోసినా సరే; ఏదైనా పరవాలేదు. సూర్యుడూ చంద్రుడూ ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో, నువ్వు క్షయవల్ల చనిపోవడం అంత అసంభవం,” అని చెప్పి శ్రీయుక్తేశ్వర్‌గారు చటుక్కున, “నేను మనస్సు మార్చుకోకముందే వెళ్ళిపో ఇంక!”

గాభరాగా వంగి నమస్కారంచేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తరవాతి వారాల్లో వాణ్ణి చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను; కాని వాడి పరిస్థితి రానురాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను.

“శశికి ఈ రాత్రి గడవదు.” అంటూ వైద్యుడన్న మాటలూ దాదాపు ఎముకల గూడులా దిగజారిపోయి వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిని బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను. నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చెప్పిన సమాచారమంతా ఉదాసీనంగా విన్నారు.

“నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావిక్కడికి? శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే!”

నేను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనకు ప్రణామంచేసి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. శ్రీయుక్తేశ్వర్‌గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోకి వెళ్ళిపోయారు. రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి; ఆయన చూపు లోకాంతరానికి పయనించింది.

వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్ళాను. మావాడు మంచం మీద కూర్చుని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను.

“ముకుందా! ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు! నాలుగు గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవమయింది;