ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

295

కృతజ్ఞతాబద్ధుణ్ణయి నేను ఆయన పాదాలముందు వాలబోతున్నాను. చటుక్కున ఆయన నన్ను ఆపారు.

“మరీ పసిపిల్లాడివయిపోకు. లేచి, గంగమీద పడుతున్న వెన్నెల అందం చూసి ఆనందించు,” అన్నా రాయన. కాని ఆయన పక్కన నేను మౌనంగా నించుని ఉన్నప్పుడు, గురుదేవుల కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి. నాకు స్వస్థత చేకూర్చినవాడు భగవంతుడే కాని తాము కారన్న అనుభూతి నాకు కలగాలని ఆయన ఆశిస్తున్నట్టుగా, ఆయన వైఖరినిబట్టి గ్రహించాను.

నేను నిజంగా, ఒకానొక మానవాతీత స్వరూపులతో కలిసి జీవించానన్న చిరకాలగతమైన, చిరవాంఛితమైన ఆనాటి అనుభవానికి జ్ఞాపక చిహ్నంగా నే నిప్పటికీ, సీసంతో కలిపి చేసిన ఆ వెండి కడియాన్ని ధరిస్తూనే ఉన్నాను. తరవాత కొన్ని సందర్భాల్లో నేను, రోగ విముక్తి కోసం నా స్నేహితుల్ని శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గరికి తీసుకు వెళ్ళినప్పుడు ఆయన, రత్నాలు ధరించమనికాని కడియం[1] వేసుకోమనికాని తప్పకుండా చేప్పేవారు; వాటిని వాడడం జ్యోతిషశాస్త్రజ్ఞానంవల్ల కలిగిన లాభమంటూ మెచ్చుకునేవారు.

జ్యోతిషశాస్త్రాన్ని గురించి నాకు చిన్నప్పటినించీ వ్యతిరేకాభిప్రాయం ఉండేది. దానికి కారణం కొంతవరకు, చాలామంది దాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారన్న సంగతి నేను గమనించడం ఒకటి, “నువ్వు మూడుసార్లు పెళ్ళి చేసుకుంటావు; రెండుసార్లు భార్యను పోగొట్టుకుంటావు,” అంటూ మా ఇంటి సిద్ధాంతిగారు జోస్యం చెప్పడం ఒకటి. వివాహత్రయానికి బలికాబోయే మేకలా బాధపడుతూ ఈ విషయాన్ని గురించి నేను తీవ్రంగా ఆలోచించాను.

  1. అధ్యాయం : 25 చివరి అధోజ్ఞాపిక చూడండి.