ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 16

గ్రహాల్ని ఓడించడం

“ముకుందా, నువ్వు జ్యోతిష సంబంధమైన [గ్రహదోష నివారకమయిన] దండ కడియం ఒకటి ఎందుకు సంపాదించకూడదూ?

“నేను సంపాదించాలా గురుదేవా? జ్యోతిషశాస్త్రంమీద నాకు నమ్మకం లేదండి.”

“నమ్మకమన్నది కాదిక్కడ ప్రశ్న; ఏ విషయాన్ని గురించి అయినా మనిషి ఏర్పరుచుకోవలసిన శాస్త్రీయ దృక్పథం, ఆ విషయం సత్యమా కాదా అన్నది. గురుత్వాకర్షణ నియమం న్యూటన్ తరవాత ఎంత సమర్థంగా పనిచేస్తోందో ఆయనకు ముందుకూడా అలా పని చేసింది. విశ్వనియమాలు, మానవుడి నమ్మకమనే ఒప్పుదల ఉంటేనేకాని పనిచెయ్యలేకపోయేటట్లయితే ఈ విశ్వం గందరగోళమయిపోతుంది.

“తెలిసీ తెలియని పండితమ్మన్యులు సనాతనమైన ఖగోళశాస్త్రాన్ని అప్రతిష్ఠపాలు చేశారు. జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రీయంగానూ[1] తాత్త్వి

  1. సనాతన హిందూ గ్రంథాల్లో ఉన్న ఖగోళశాస్త్ర సంబంధమైన ప్రస్తావనల్ని బట్టి పండితులు, గ్రంథకర్తల కాలాన్ని నిర్ధారణ చెయ్యగలుగుతున్నారు. ఋషుల శాస్త్రీయవిజ్ఞానం ఎంతో మహత్తరమైనది. జ్యోతిష సంబంధమైన వ్రతాదికాలు జరిపేందుకు శుభలగ్నాలు నిర్ణయించడానికి వీలైన, ఔపయోగికమైన విలువగల ఖగోళశాస్త్ర పరిజ్ఞానంలో హిందువులు క్రీ. పూ. 3100 నాటికే ఎంతో అభివృద్ధి సాధించారు. ఈ సంగతి సూచించే సునిశితమైన ఖగోళశాస్త్ర విషయాలు మనకు కౌషీల్‌కి బ్రాహ్మణంలో కనిపిస్తాయి. 1934 ఫిబ్రవరినెల ‘ఈస్ట్ వెస్ట్’ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసంలో జ్యోతిషాన్ని గురించి లేదా వైదిక ఖగోళశాస్త్ర గ్రంథావళిగురించి ఇలా ఉంది: “భారతదేశాన్ని ప్రాచీన దేశాలన్నిటికీ అగ్రస్థానంలో నిలిపి, విజ్ఞానాన్వేషకులకు దాన్ని పవిత్ర యాత్రాస్థలంగా చేసిన శాస్త్రీయ విజ్ఞానం దాంట్లో ఉంది. “బ్రహ్మగుప్త” అనే పేరుతో ఖగోళశాస్త్ర గ్రంథం ఒకటి ఉంది. ఇందులో, మన సూర్యమండలంలో ఉన్న గ్రహాల సూర్యకేంద్రక చలనం, భూభ్రమణమార్గ కక్ష్య, భూమికున్న గోళాకృతి, చంద్రుడి పరావర్తన కాంతి, ప్రతిరోజూ భూమి తన అక్షంమీద చేసే పరిభ్రమణం, పాలపుంతలో స్థిరనక్షత్రాల ఉనికి, గురుత్వాకర్షణ నియమంవంటివే కాక, కోపర్నికస్, న్యూటన్‌ల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచానికి తెలియని వైజ్ఞానిక యథార్థాల్ని ఎన్నిటినో ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. “పాశ్చాత్య గణితశాస్త్రాభివృద్ధికి అమూల్యంగా ఉపకరించిన “అరబ్బీ అంకెలు” అనేవి భారతదేశం నుంచి అరబ్బుల ద్వారా యూరప్‌కు తొమ్మిదో శతాబ్దంలో వచ్చాయి. భారతదేశంలో ఈ అంకలేఖన ప్రణాళిక ప్రాచీనకాలంలోనే రూపొందింది. భారతదేశపు అపార వైజ్ఞానిక వారసత్వాన్ని గురించి మరికొంత సమాచారం ఈ కింది గ్రంథాల్లో కనిపిస్తుంది; సర్ పి. సి. రాయ్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’లో, బి. ఎస్. సీల్ రాసిన ‘పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ఏన్షెంట్ హిందూస్’లో, బి. కె. సర్కార్ రాసిన ‘హిందూ ఎచీవ్‌మెంట్స్ ఇన్ ఎగ్జాక్ట్ సైన్స్’లో, ఆయనే రాసిన ‘ది పాజిటివ్ బాక్ గ్రౌండ్ ఆఫ్ హిందూ సోషియాలజీ’లో, యు. సి. దత్ రాసిన ‘మెటీరియా మెడికా ఆఫ్ ది హిందూస్’ లోను.