ఈ పుట ఆమోదించబడ్డది

278

ఒక యోగి ఆత్మకథ

సంబంధించిన వివరాలు అజమాయిషీ చేస్తూ ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉంటారు ఆయన; అయినా అత్యంత శక్తిమంతుడైన పడుచు శిష్యుడితో సమానంగా పనిచేస్తారు.

రెండో అంతస్తులో సంకీర్తనం (బృందగానం) జరుగుతోంది; పక్కన హార్మణీ, మద్దెలా వాయిస్తున్నారు. దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీయుక్తేశ్వర్‌గారు; ఆయన సంగీతజ్ఞానం సునిశిత పరిపూర్ణమైనది.

“వాళ్ళ శ్రుతి తప్పింది” గురుదేవులు వంటవాళ్ళని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు. మళ్ళీ శ్రావ్యత ధ్వనించింది; ఈసారి సరిగా వాయించారు.

సామవేదంలో సంగీతశాస్త్రాన్ని గురించిన, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో సంగీతాన్నీ, చిత్ర కళనూ నాటకాన్నీ దివ్యకళలుగా పరిగణిస్తారు. శాశ్వత త్రిమూర్తులయిన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు. విశ్వనర్తకుడయిన నటరాజ రూపంలో శివుడు, విశ్వసృష్టి స్థితిలయాల ప్రక్రియల్లో అనంత ప్రకారాల తాళలయల్ని సృష్టించినట్టూ, బ్రహ్మ తాళాలు వాయించినట్టూ విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది.

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి, తంత్రీ వాద్యాలన్నిటికీ తల్లి అయిన వీణను చేతబట్టి వాయిస్తున్నట్టుగా చిత్రించడం జరిగింది. విష్ణువు అవతారాల్లో ఒకడయిన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్టు హిందూ కళలో చిత్రించారు, దానిమీద అతడు, మాయాజాలంలో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగిరమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవశ్యం కలిగించే పాట వాయిస్తాడు.