ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వచేతనానుభవం

265

“అది నిజం; కాని ఆయన సన్నిహితుడూ ప్రియుడూ కూడా. క్రియాయోగంవల్ల మనస్సు ఇంద్రియావరోధాల్ని తొలగించేసిన తరవాత ధ్యానం, దేవుణ్ణి రెండు విధాల నిదర్శనంతో నిరూపిస్తుంది. మనలో అణు వణువుకూ నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయే నిత్యనూతనానందం ఆయన ఉనికికి నిదర్శనం. అంతే కాకుండా, కలిగిన ప్రతి కష్టానికీ ఆయన దగ్గర్నించి, అవసరమైన సమాధానం, తక్షణ మార్గనిర్దేశ రూపంలో ధ్యానంలో లభిస్తుంది.”

“గురూజీ, మీరు నా చిక్కు విప్పేశారన్నది స్పష్టమయింది.” కృతజ్ఞతాభరితంగా చిరునవ్వు నవ్వాను. “నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను; ఎలాగంటే, మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో, ధ్యానంలో కలిగినప్పటి ఆనందం, అవచేతనా రూపంగా మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ, చిన్నచిన్న వివరాలతో సహా, నేను సరయిన దారి పట్టేటందుకు, సూక్ష్మపద్ధతిలో, నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది.”

“దైవసంకల్పంతో ఐక్యానుసంధానం చెయ్యడమెలాగో తెలుసుకునే వరకు మానవజీవితం దుఃఖభూయిష్ఠంగానే ఉంటుంది; ఆయన నిర్ణయించిన ‘సరయిన దారి’. అహంభావపూరితమైన తెలివిని తరచుగా గాభరాపెడుతూ ఉంటుంది,” అన్నారు గురుదేవులు.

“దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు; ఆయన తప్ప మరెవ్వరు మొయ్యగలరు ఈ బ్రహ్మాండభారాన్ని?”