ఈ పుట ఆమోదించబడ్డది

6

ఒక యోగి ఆత్మకథ

“పది రూపాయలెందుకు? ఒక్కటి చాలు.” నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోడానికి ఇంకా ఇలా అన్నారు: “మా నాన్న గారూ, తాతయ్యా, నాయనమ్మా హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా?- ఒక చిన్న అరటిపండు మాత్రమే. తరవాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బుకోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా! డబ్బున్న ఓ జడ్జిగారిని ఆశ్రయించి నెల కొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఇయ్యనన్నా డాయన; ఒక్క రూపా యయినా తనకి ముఖ్యమైందే నన్నాడు.”

“ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచు కుంటున్నారు!” అమ్మకున్న దయకు, చటుక్కున సమర్థించుకోగల కారణం ఉంటుండేది. “తొందరపని పడ్డప్పుడు పదిరూపాయి లివ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ, అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా?”

“నువ్వే గెలిచావులే!” ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి, డబ్బుల సంచీ తెరిచారాయన. “ఇదుగో పది రూపాయల నోటు. నా శుభాకాంక్షలతో ఆవిడ కియ్యి.”

ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట, ‘వద్దు’ అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మదగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి, మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోక పోవడమన్నది నిజంగా, “ఆలోచించి నిర్ణయించాలి” సూత్రాన్ని పాటించడమే. తీసుకొనే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా