ఈ పుట ఆమోదించబడ్డది

236

ఒక యోగి ఆత్మకథ

నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారా శ్రీయుక్తేశ్వర్‌గారు ప్రతి ప్రత్యర్థినీ ఓడించారు. బిచ్చమెత్తుకొనే గురువుగాగాని, తమ శిష్యులకు భారంగాగాని ఎన్నడూ బతకడం ఇష్టంలేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తల ఒగ్గవలసి వచ్చింది.

భయావహమైన నిష్కాపట్యం గల మా గురుదేవులు లౌక్యసంబంధమైన కపటాలు ఎరక్కపోవడానికి ఒక కారణం, ఆయనకుగల ఆర్థిక స్వాతంత్ర్యం. తమను పోషించేవాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు, ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలుకాని, సూక్ష్మప్రభావాలుకాని తమ మీద పనిచెయ్యనివారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకర్ని డబ్బు అడగడంగాని, సూచనగా చెప్పడంగాని నేను ఎన్నడూ వినలేదు.

ఒకనాడు కోర్టు సమన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కనాయి అనే శిష్యుడూ నేనూ అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్ళాం.

శ్రీ యుక్తేశ్వర్‌గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. “మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది,” అన్నాడతను తిరస్కార భావంతో.

నేను ఓర్చుకోలేకపోయాను. “అమర్యాదగా మరొక్కమాట బయటికి వచ్చిందా, నువ్వు మట్టి కరుస్తావు!” అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాను.

కనాయి కూడా ఆ ఉద్యోగిమీద అరిచాడు. “నీచుడా! ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చెవాకులూ పేల్తావా?”