ఈ పుట ఆమోదించబడ్డది

214

ఒక యోగి ఆత్మకథ

పొరపాటు జరిగితే చాలు, ఆయన చివాట్లు తప్పేవి కావు. అహంకారాన్ని అణగ్గొట్టే ఈ మాదిరి వ్యవహారవిధానం సహించడం కష్టమే అయినప్పటికీ, నాలో ఉన్న మానసికమైన ఎగుడుదిగుళ్ళను చదునుచెయ్యడానికి శ్రీ యుక్తేశ్వర్‌గారిని అనుమతించాలన్నదే మార్చరాని నా తీర్మానం.

“నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడయినాసరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు,” అని హామీ ఇచ్చారు గురుదేవులు. “నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను. నీకు లాభం కలుగుతోందనిపిస్తేనే ఉండు.”

నా దురహంకారాన్ని సమ్మెట దెబ్బలతో అణిచేసినందుకు నే నాయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి. ఆలంకారికంగా చెప్పాలంటే, నా దవడకున్న పలువరసలో ప్రతి పుప్పిపన్నూ కనిపెట్టి పీకేస్తున్నారాయన, అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు. అహంభావాన్ని తొలగించాలంటే మొరటుగా తప్ప మరే విధంగా నయినా కష్టమే. అది పోయిన తరవాతనే ఈశ్వరానుభూతికి, చివరికి నిర్నిరుద్ధమైన దారి దొరుకుతుంది. స్వార్థంతో బండబారిన గుండెల్లోకి చొరబారడానికి అది చేసే ప్రయత్నం వృథాయే అవుతుంది.

శ్రీ యుక్తేశ్వర్‌గారి సహజావబోధం తీక్ష్ణంగా ఉండేది. ఆయన తరచు, అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తంలేకుండా, అతను బయటపెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవారు. ఒక మనిషి వాడిన మాటలూ వాటి వెనకఉన్న వాస్తవమైన ఆలోచనలూ భిన్న ధ్రువాలు అయి ఉండవచ్చు. “మనుషుల పదాడంబరంవల్ల కలిగే గందరగోళానికి వెనకఉన్న ఆలోచనల్ని ప్రశాంతతద్వారా అనుభూతం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి,” అన్నారు మా గురుదేవులు.

దివ్యమైన అంతర్దృష్టివల్ల బయల్పడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచు కటువుగా ఉంటాయి. పైపై మెరుగులతో సరిపెట్టుకొనే