ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

205

జరిగింది; తరవాత లాస్ ఏంజిలస్‌లో ఒక కొండమీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది; ఆ తరవాత కాలిఫోర్నియాలోని ఎన్సినిటాస్‌లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించడం జరిగింది.

“ఫలానా ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెబుతున్నాను.” అంటూ గురుదేవులు ఎన్నడూ దంభాలు పలక లేదు. అలా కాకుండా, “ఇది జరగవచ్చునేమో కదూ?” అంటూ సూచన చేసేవారు. ఆయన నిరాడంబర వాక్కు, భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగు పరిచేది. అన్న దాన్ని వెనక్కి తీసుకోడమన్నది లేదు; కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కాలేదు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు మితభాషులు; వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టతకాని, కలలుకనే స్వభావంకాని ఆయనలో ఏ కోశానా లేదు. ఆయన కాళ్ళు నేలమీదే నిలదొక్కుకుని ఉండేవి; ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకొని ఉండేది. వ్యవహారదక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయేవారు. “సాధుత్వమంటే మూగతనం కాదు! దివ్యానుభూతులు అశక్తుణ్ణి చేసే వేమీ కావు!” అంటారాయన. “క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీవ్రమైన బుద్ధికి ప్రేరకమవుతుంది.”

మా గురుదేవులు అధిభౌతిక క్షేత్రాల్ని గురించి చర్చించడానికి విముఖులు. ఆయన ప్రసరించే ఒకేఒక “అద్భుత” ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషణ చేసేటప్పుడాయన, ఆశ్చర్యం కలిగించే ప్రస్తావన లేవీ రాకుండా చూసేవారు; పనిలో ఆయన విలక్షణత స్వేచ్ఛగా అభివ్యక్తమయేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కాని చేసి చూపించగలిగింది శూన్యం; శ్రీయుక్తేశ్వర్‌గారు