ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

191

ఆదరించేవారు. తాను ఈ దేహమనికాని, అహంకారమనికాని భావించుకోకుండా సర్వవ్యాప్తమయిన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురువు, మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు.

సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడివల్ల ఇకెన్నడూ ప్రభావితులు కారు; అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని గందరగోళపరిచే రాగద్వేషాలకు వారిక అధీనులు కారు. శ్రీయుక్తేశ్వర్‌గారు అధికార ప్రాబల్యంగలవాళ్ళకూ డబ్బుగలవాళ్ళకూ గుణసంపన్నులకూ ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు; ఇతరులను పేదరికంవల్లకాని చదువుకోకపోవడంవల్లకాని చిన్న చూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లవాడి నోటినించి వచ్చినా గౌరవభావంతో వింటారు; ఒక్కొక్కప్పుడు డాంభిక పండితుణ్ణి బహిరంగంగా ఉపేక్షిస్తారు.

రాత్రి భోజనం ఎనిమిది గంటలకి. అప్పుడప్పుడు ఆతిథులక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు; ఆయన ఆశ్రమానికి వచ్చినవాళ్ళెవరూ ఆకలితోకాని అసంతృప్తితోకాని తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీయుక్తేశ్వర్‌గారు ఎన్నడూ గాభరాపడనూ లేదు; నిరుత్సాహంచెందనూ లేదు. సద్యఃస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సూచనలవల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి; ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలావాటికి సరిపడేది. “నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు,” అంటూండేవారు తరచు. “విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తరవాత దుఃఖపడతావు.” ఆశ్రమంలో జరిగే వేడుకల విషయంలో నయితేనేం, భవన నిర్మాణ విషయంలో నయితేనేం, మరమ్మ