ఈ పుట ఆమోదించబడ్డది

190

ఒక యోగి ఆత్మకథ

కావచ్చు. ఆ తరవాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి; ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులయి ఉండేవారు.

తరవాత, ఫలహారాల కార్యక్రమం ఉండేది కాదు; మొదట గంగ ఒడ్డున చాలా దూరం నడవాలి. మా గురువుగారితో పొద్దుటిపూట నడిచిన ఈ నడకలు ఇప్పటికీ ఎంత వాస్తవంగా, ఎంత స్పష్టంగా మనసులో ఉన్నాయో! జ్ఞాపకాల్ని అలవోకగా నెమరువేసుకుంటే చాలు; నేను గురుదేవుల పక్కనే ఉన్నట్టు తరచు అనిపిస్తూ ఉంటుంది. ఉదయ భానుడు ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు; జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం ఖంగుమని మోగుతున్నది.

స్నానం; ఆ తరవాత మధ్యాహ్న భోజనం. గురుదేవులు ఏరోజు కారోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడమన్నది శిష్యుల్లో కుర్రవాళ్ళ బాధ్యత. మా గురుదేవులు శాకాహారి. అయితే, సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు, చేపలు తినేవారు. ఎవరి శరీర తత్త్వానికి పడే సాదా భోజనం వారు చెయ్యండన్నదే ఆయన శిష్యులకు ఇచ్చిన సలహా.

గురువుగారు చాలా మితంగా తినేవారు; తరచుగా ఆయన, అన్నంలో పసుపు కలిపిగాని, బీటుదుంపల రసంగాని, పాలకూరగాని వేసుకొని, పైన గేదెనెయ్యి చిలకరించుకొని తినేవారు. మరోనాడు, చిక్కుడు గింజలో సెనగలో కలిపి వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర, పాయసంతోబాటు మామిడిపళ్ళుగాని, నారింజపళ్ళుగాని తినేవారు; లేదా పనసతొనల రసం తాగేవారు.

ఆయన దర్శనం చేసుకోదలిచినవాళ్ళు మధ్యాహ్నంపూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు. మా గురుదేవులు వచ్చినవాళ్ళనందరినీ మర్యాదగా, దయతో