ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

185

బయట దొడ్లోనూ తిరిగాను. మంచి విశాలంగా, ఎప్పుడో చాలాకాలం కిందట కట్టుదిట్టంగా, భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం, దొడ్డికి చుట్టూ ఉంది. బయటి గోడలు నాచుపట్టి ఉన్నాయి; మర్యాదలేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టిన పావురాలు, బూడిదరంగు మిద్దెమీద రెక్కలు ఆడిస్తున్నాయి. పనసచెట్లు, మామిడిచెట్లు, అరటిచెట్లు ఉన్న పెరటిదొడ్డి చూడముచ్చటగా ఉంది. ఈ రెండంతస్తుల భవనంలో పైనున్న గదులకు, చిన్న పిట్టగోడలతో ఉన్న బాల్కనీలు, దొడ్డికి మూడు వైపులా కనిపించేట్టు ఉన్నాయి. కింది అంతస్తులో, వరసగా ఉన్న స్తంభాల మీద ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమయిన హాలు ఉంది; దీన్ని ముఖ్యంగా, ఏటేటా వచ్చే దుర్గాపూజ ఉత్సవాలకు వాడతారని గురువుగారు అన్నారు. శ్రీయుక్తేశ్వర్‌గారు కూర్చునే గదికి వెళ్ళడానికి సన్నటి మేడమెట్లు ఉన్నాయి; వారి గది బాల్కనీ వీధివేపు ఉంది. ఆశ్రమంలో అమర్చిన సామానంతా నిరాడంబరంగా ఉంది. అన్నీ పరిశుభ్రంగా, ఉపయోగకరంగా ఉన్నవే. పాశ్చాత్య ఫక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి.

ఆ రాత్రికి నన్నక్కడ ఉండిపొమ్మని కోరారు గురువుగారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులిద్దరు వడ్డన చేశారు.

“గురూజీ, మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి.” ఆయన కూర్చున్న పులిచర్మానికి దగ్గరగా, ఒక తుంగచాపమీద కూర్చున్నాను. బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల్లా, దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి.

“నా సంసార నామం ప్రియనాథ్ కరార్. నే నిక్కడే, శ్రీరాం