ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

183

“ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు వెడతావు. అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయం పట్టం ఒకటి ఉన్నట్లయితే అక్కడి ప్రజలు, భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకళించుకోడానికి మరింత సుముఖంగా ఉంటారు.”

“ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ!”

నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాలగురించి ఆయన చేసిన ప్రస్తావన, నాకు గజిబిజిగా, ఊహకు అందకుండా ఉంది. కాని అణకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడం నాకు చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం.

“దగ్గరగా కలకత్తాలో ఉంటావు, నీకు సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు.”

“వీలుంటే, ప్రతిరోజూ వస్తాను స్వామీ! నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను – కాని ఒక్క షరతు.”

“చెప్పు.”

“దైవసాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాట ఇయ్యాలి!”

ఆ తరవాత ఒక గంట సేపు వాగ్యుద్ధం జరిగింది. గురువుగారు ఇచ్చిన మాట బోటుకాగూడదు; అదంత తేలిగ్గా ఇచ్చేది కాదు. ఇలాటి వాగ్దానంలో, విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాల్ని ఆవిష్కరిస్తానన్న గూడార్థం ఇమిడి ఉంటుంది. ఏ గురువయినా, సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగేటట్టయితే, అంతకుముందు అతడు ఆయనతో అంత చనువు ఏర్పరుచుకొని ఉండాలి! శ్రీయుక్తేశ్వర్‌గారికి భగవంతుడితో ఉన్న