ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

165

కలుసుకున్నప్పుడు, నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది. నిన్నంత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను; నా కఠిన శిక్షణకు విధేయుడవై పూర్తిగా తల ఒగ్గాలి.”

నేను మొండిపట్టు మీద మౌనంగా ఉన్నాను. గురుదేవులు నా కష్టాన్ని, తొందరగానే కనిపెట్టారు.

“మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారంటావా?”

“నేను తిరిగి వెళ్ళను.”

“నువ్వు ముప్ఫై రోజుల్లో తిరిగి వెడతావు.”

“ఎన్నడూ జరగదు.”

మా వివాదంలో బింకం సడలకపోవడంతో, నేను ఆయన పాదాలకు భక్తి పురస్సరంగా ప్రణామం చేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాను. అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వేపు నడిచి వెళ్తూ, అలౌకిక ఘటనగా జరిగిన ఈ సమాగమం ఇలా విరసంగా ఎందుకు మగిసిందా అని వితర్కించుకున్నాను. మాయ అనే తక్కెడ సిబ్బులు రెండూ ప్రతి సంతోషాన్ని ఒక దుఃఖంతో సమానంచేసి తూస్తాయి. పరివర్తన కారకాలయిన, గురుదేవుల చేతివేళ్ళకు నా కిశోర హృదయం ఇంకా మెదువు కాలేదు.

మర్నాడు పొద్దున, ఆశ్రమవాసుల్లో నా మీద పెడసరిభావం మరింత పెరగడం గమనించాను. అక్కడున్నన్నాళ్ళూ నన్ను సూటిపోటి మాటలతో పొడిచి వేధించారు. మూడు వారాలు గడిచాయి. బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్ళారు. అప్పుడు దురదృష్టవశాత్తు అంతా నా మీద విరుచుకుపడ్డారు.

“ముకుందుడు తేరగా తిని కూర్చుంటాడు. ఆశ్రమంలో పడి తినే