ఈ పుట ఆమోదించబడ్డది

160

ఒక యోగి ఆత్మకథ

గుచ్చిగుచ్చి చూస్తూండేవి; వాటిలో నాకు, పూర్తిగా అర్థంకాని ఆశాభావ మేదో పొడగడుతూ ఉండేది.

“నా తండ్రీ! వచ్చేశావా!” అంటూ గురుదేవులు, ఆనందంతో తబ్బిబ్బయి వణుకుతున్న గొంతుతో, బెంగాలీ భాషలో మళ్ళీమళ్ళీ అన్నారు. “ఎన్నేళ్ళు కాచుకొని ఉన్నాను బాబూ నీ కోసం!”

మే మిద్దరం మౌనంలో ఐక్యమయాం. మాటలు బొత్తిగా అనవసర మనిపించాయి. అనర్గళ వాగ్ఝరి, నిశ్శబ్ద మంత్రరూపంలో గురుదేవుల గుండెలోంచి నేరుగా శిష్యుడిలోకి ప్రవహించింది. నా గురుదేవులు దైవసాక్షాత్కారం పొందినవారనీ నన్ను వారు దైవసన్నిధికి చేరుస్తారని నిరాక్షేపమైన అంతర్దృష్టివల్ల తెలుసుకున్నాను. ఈ జీవితంలో అలుముకున్న చీకటి, గతజన్మల జ్ఞాపకాలనే చిరు పొద్దుపొడుపుతో అదృశ్యమయిపోయింది. నాటకీయం కాలం! చక్రగతిలో ఆవృత్తమయే గతం, వర్తమానం, భవిష్యత్తు దాని దృశ్యాలు. ఈ పవిత్ర పాదసన్నిధిలో నన్ను గమనించిన తొలిపొద్దు ఇది కాదు!

గురుదేవులు నా చెయ్యి పట్టుకుని, ఆ ఊళ్ళో రాణామహల్ బస్తీలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళారు. క్రీడాకారుడి మాదిరిగా బలిష్ఠదేహు లయిన ఆయన నడక దృఢగతిలో సాగింది. పొడుగ్గా, నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి ఏభై ఐదేళ్ళున్నప్పటికీ యువకుడిలా మంచి చురుగ్గా, సత్తువలో ఉన్నారు. ఆయన కళ్ళు నల్లగా, విశాలంగా, ప్రగాఢమైన జ్ఞానంతో నిండి, అందంగా ఉన్నాయి. కొద్దిగా వంకులు తిరిగిన జుట్టు, ఆయన ముఖగాంభీర్యానికి మార్దవం చేకూర్చింది. బలం సాధుత్వంతో సూక్ష్మరూపంలో మేళవించింది.

గంగకు ఎదురుగా ఉన్న, ఆ ఇంటి రాతి బాల్కనీలోకి మేము వెడుతూ ఉండగా, ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు: