ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

157

చిన్నప్పుడు మా అమ్మకి ఒక సాధువు ఇచ్చినది. కొన్నేళ్ళుగా దాన్ని నేను కాపాడుకుంటూ, ఇప్పుడు ఆశ్రమంలో నా గదిలో జాగ్రత్తగా దాచిపెట్టాను. ఒకనాడు పొద్దున నేను, రక్షరేకును మళ్ళీ ఒకసారి చూసుకొని ఆనందిద్దామని తాళంవేసిన పెట్టె తెరిచాను, సీలు వేసిన కవరును ఎవరూ తాకనయినా లేదు; కాని రక్షరేకు మాయమయింది! అది పోయినందుకు ఎంతో బాధపడుతూ, కవరు చింపి చూసుకొని, నేను పొరపాటు పడ్డానికి అవకాశం లేదని రూఢి చేసుకున్నాను. ఆ సాధువు జోస్యం చెప్పిన ప్రకారమే, ఆయన శూన్యంలోంచి తెప్పించి ఇచ్చినది తిరిగి శూన్యంలోనే కలిసి పోయింది.

దయానందుల అనుయాయులతో నా సంబంధం క్రమంగా చెడిపోతూ వచ్చింది. కావాలని నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నందువల్ల నొచ్చుకొని, వాళ్ళూ నాకు దూరమయారు. ఏ ఆశయంతో నేను ఇంటినీ, ప్రాపంచికమయిన ఆశల్నీ అన్నిటినీ వదులుకుని దైవధ్యాన నిష్ఠకు కట్టుబడి ఉన్నానో ఆ ఆశయమే అన్ని వేపులనించీ నిస్సారమైన విమర్శకు గురిఅవుతూ వచ్చింది.

ఆధ్యాత్మికమైన పరివేదనతో మనస్సు కకావికలై, ఒకనాడు తెల్లవారగట్ల నేను అటకమీదికి వెళ్ళి, భగవంతుడు నా నొక సమాధానం అనుగ్రహించే వరకు ప్రార్థన చేయ్యాలని నిశ్చయించుకున్నాను.

“దయామయి జగన్మాతా, దివ్యదర్శనాల ద్వారా నువ్వయినా నాకు జ్ఞానబోధ చెయ్యి; లేకపోతే నువ్వు పంపే గురువుద్వారా నయినా బోధించు!”

గంటల తరబడిగా నేను వెక్కి వెక్కి ఏడుస్తూ పెట్టుకొన్న మొరకు సమాధానం రాలేదు. ఇంతలో హఠాత్తుగా, అనంతమైన ఒక వలయాకార మండలంలోకి నన్ను సశరీరంగా లేవనెత్తినట్టు అనిపించింది.