ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

95

“ఈ కథ నా మనస్సు కెక్కలేదు. నాన్న గారు, ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను.”

తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన, సహనం కోల్పోయినవాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు. చాలా సేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే, మేమక్కడ ఉన్న సంగతే ఆయన ఎరగనట్టున్నారు. అంతవరకు చెప్పిన కథలో, విడిచిపెట్టిన కొస మళ్ళీ అందుకుని సాగించేసరికి, ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది.

“నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే, నేను కూచ్ బిహార్ రాజధానికి వెళ్ళాను. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త. విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను. మామూలుగా ప్రతిచోటా జరిగినట్టుగానే అక్కడ కూడా, వీథుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు. గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా:

“ ‘అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనే.’ ”

“ ‘ఈయనవి కాళ్ళా, చెట్ల బోదెలా?’ ”

“ ‘ఆయన మొహం చూడు! పులిరాజు అవతారమే అయి ఉండాలి!’ ”

“వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లా, పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా! అంతకంటె కూడా ఆలస్యంగా వెలువడే ఆడవాళ్ళ ప్రసంగ విశేషాలు ఇంటింటికీ ఎంత వడిగా వ్యాపిస్తాయో! ఒక్క కొన్ని గంటల్లోనే, నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమందటా ఉద్రేకం చెలరేగింది.”

“సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను.”