ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

93

టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గతకాలపు దృశ్యాల్ని తిరగదోడుతున్నట్టుగా, ఆ చూపు ఎటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా, వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను. చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు.

“నా కీర్తి ఉచ్చస్థితి నందుకొనేటప్పటికి, దానివల్ల నాలో గర్వ మదం ఏర్పడింది. పులులతో పోట్లాడటమే కాకుండా, వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చెయ్యాలని నా ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను; దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను.

“ఒకనాడు సాయంత్రం, మా నాన్న గారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు.

“ ‘బాబూ, నీకు నాదో చిన్న హెచ్చరిక. కార్యకారణాలనే తిరగలి రాళ్ళ మధ్య ఉత్పన్నమయి రాబోయే ముప్పులనుంచి నిన్ను కాపాడుతాను,’ అన్నారు.”

“నాన్నగారూ, విధినిర్ణయవాదులా మీరు? శక్తిమంతమయిన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా?”

“ ‘నేను విధినిర్ణయవాదిని కాను, నాయనా. కాని మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను. అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది; దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు.’