ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

91

ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికీ, నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది!

“భీముడంతటి బలం ఉండి కూడా, రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే, బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయస్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లిమోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి. ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి, బ్రహ్మాండమైన మనఃస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులిజిత్తులను దాని మీదికే ప్రయోగించి, దాని ప్రవృత్తిని పిల్లిలాటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే, ఎన్నిసార్లు చేశానో నేను!”

నా ఎదుట ఉన్న భీమబలుడు, పెద్దపులిని పెంపుడు పిల్లిలా మార్చెయ్య గలగడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు. చండీ నేనూ శ్రద్ధగా వింటున్నాం.

“కండరాల్ని పనిచేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం, దానికి ఉపయోగించిన శక్తిమీద ఆధారపడి ఉంటుంది; మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం, అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీదా ధైర్యం మీదా ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాలా తయారుచేసేదీ, షోషించేది మనస్సే. బలాలయినా బలహీనతలయినా, గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారానే మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయి, కోరదగిన శరీరం గానో, కోరదగని శరీరంగానో రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది. విషవలయక్రమంలో, అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే, ఆ నౌకరు నిరంకుశుడవుతాడు;