ఈ పుట ఆమోదించబడ్డది

“గంధబాబా” అద్భుతాల ప్రదర్శన

85

దివ్యసాక్షాత్కారం పొందినవాళ్ళు చూపే అద్భుత శక్తులకూ పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు, సృజనాత్మక విశ్వస్వాప్నికుడికి అనుగుణంగా శ్రుతి కలిపి, తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు.

గంధబాబాగారి లాటివాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా, అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడంవల్ల ఇవి, దేవుడికోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్ళిస్తాయి.

అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అబూ సయీద్ అనే పారశీక మార్మికుడు, నీటిమీదా గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుతశక్తుల్ని చూసుకొని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు.

“నీళ్ళలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది!” అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు అబూ సయీద్, “కాకీ రాంబందూ గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పునా పడమటా కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడు ఎవడంటే, తన తోటివాళ్ళలోనే ధార్మిక జీవనం గడుపుతూండేవాడూ, క్రయవిక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మరిచిపోనివాడూ!”[1] మరో సందర్భంలో ఈ పారశీక

  1. “క్రయవిక్రయాలు సాగిస్తూనే దేవుణ్ణి ఎన్నడూ మరవకపోవడం!” అంటే, పనిచేసే చెయ్యీ ధ్యానించే హృదయమూ కలిసి సామరస్యంగా పనిచెయ్యాలన్న ఆదర్శం ఇందులో కనబడుతుంది. హిందువులు ఏర్పరచుకొన్న లక్ష్యం, అకర్మణ్యతతోనూ సమాజ విరుద్ధమైన ఆత్మసంకోచనంతోనూ కూడుకొన్న పిరికితనపు “పలాయనం” అని కొందరు పాశ్చాత్య రచయిత లంటారు. అయితే, వేదాల్లో చెప్పిన ప్రణాళిక ప్రకారం మానవ జీవితానికి ఏర్పరచిన నాలుగు ఆశ్రమాలూ జనులందరూ ఆచరించడానికి అనువైన విధంగా, సమతూకంగా రూపొందించినవి; వీటిలో సగంకాలం అధ్యయనానికి గృహస్థాశ్రమ విధులు నిర్వర్తించడానికి, తక్కిన సగంకాలం దైవచింతనా, ధ్యానసాధనలు సాగించడానికి కేటాయించడం జరిగింది. ఆత్మలో సుస్థిరుడై ఉండడానికి, మనిషికి ఏకాంతం అవసరం; కాని తరవాత, లోకానికి సేవచేయడం కోసం గురువులు, ప్రపంచంలోకి తిరిగి వస్తారు. పైకి కనిపించే విధంగా ఏ పనీ చెయ్యని సాధువులు సైతం, తమ ఆలోచనల ద్వారానూ పవిత్ర స్పందనల ప్రసారంద్వారానూ ప్రపంచానికి అత్యంత అమూల్యమైన బహుమానాలు ప్రధానం చేస్తూ ఉంటారు. వివేక శూన్యుడైనవాడు ఎంతో శ్రమిస్తూ సాగించే మానవసేవా కార్యకలాపాలవల్ల కలిగే మేలుకన్న, వీరివల్ల ప్రపంచానికి ఇంకా ఎక్కువ విలువైన మేళ్ళు చేకూరతాయి. మహాపురుషులు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, తరచుగా తీవ్రమైన ప్రతిఘటనను కూడా లెక్క చెయ్యకుండా, తోటివారిని ఉత్తేజపరచడానికి ఉద్ధరించడానికి నిస్స్వార్ధంగా శ్రమిస్తూ ఉంటారు. హైందవ ధార్మికాదర్శం కాని, సామాజికా దర్శం కాని ఏ ఒక్కటీ కేవలం నకారాత్మకం కాదు. మహాభారతంలో, “సకలో ధర్మః” అని చెప్పిన ‘అహింస’, సకారాత్మకమే కావడానికి కారణం, ఇతరులకు సహాయం చెయ్యనివాడు ఏదో ఒక విధంగా వాళ్ళకి హానే చేస్తున్నాడన్న భావన దాంట్లో ఉంది.

    కర్మ ప్రవృత్తి మానవ ప్రకృతిలోనే సహజంగా ఉందని చెబుతుంది భగవద్గీత (అధ్యా. 3 : శ్లో. 4-8). సోమరితనం కేవలం “దుష్కర్మ ప్రవృత్తి”.

    న కర్మణా మనారంభా న్నైష్కర్మ్యం పురుషో౽శ్నుతే,
    న చ సస్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి || (4)

    నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
    కార్యతే హ్యవళః కర్మ సర్వ ప్రకృతిజై ర్గుణైః || (5)

    కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
    ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే || (6)

    యక్‌స్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే౽ర్జున,
    కర్మేంద్రియైః కర్మయోగ మసక్తస్స విశిష్యతే !! (7)

    నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః,
    శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః || (8)