ఈ పుట ఆమోదించబడ్డది

84

ఒక యోగి ఆత్మకథ

వల్ల పుడతాయి. పర్యాయక్రమంలో, ఈ స్పందనలను ప్రాణం– అంటే “లైఫ్ ట్రాన్‌లు” క్రమబద్ధం చేస్తాయి. ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు; లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపరంగా భరితమైన-పరమాణువుల కంటె కూడా సూక్ష్మతరమైన శక్తులు.

గంధబాబాగారు, కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాలవల్ల తనను తాను ప్రాణశక్తికి సరిచేసుకొని, లైఫ్ ట్రాన్‌లు (ప్రాణాణువులు) తమ స్పందనాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి, కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు. ఆయన చూపించిన వాసన, పండు, తదితర అలౌకిక శక్తులు, ప్రాపంచిక స్పందనాల వాస్తవ వస్తురూప కల్పనలే కాని సమ్మోహనంవల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు.

చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు, మత్తుమందు ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో, సమ్మోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు. కాని ఇది, తరచుగా సమ్మోహన స్థితికి గురి అయే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి, వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి, మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనమన్నది ఇతరుల చేతనా

పరిధిలోకి అనధికారంగా ప్రవేశించడం.[1] దీని తాత్కాలిక దృగ్విషయాలకీ

  1. పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చేతననుగురించి సాగించిన పరిశీలనలు చాలవరకు, అవచేతన మనస్సుకూ, మనోవ్యాధి చికిత్సాశాస్త్రం ద్వారానూ మనోవైజ్ఞానిక విశ్లేషణద్వారానూ నయంచేసే మనోవ్యాధులకూ పరిమితమైనవి. సామాన్య మానసిక స్థితులకూ వాటి భావోద్రేక, సంకల్ప విషయిక అభివ్యక్తులకూ మూలాన్ని గురించి, మౌలిక నిర్మాణాన్ని గురించి జరిగిన పరిశోధన చాలా స్వల్పం; నిజంగా మౌలికమయిన ఈ విషయాన్ని భారతీయ దర్శనశాస్త్రం ఉపేక్షించలేదు. సాంఖ్య యోగ శాస్త్రాల్లో సామాన్య మానసిక సవరణల్లోని వివిధ సంబంధాలనూ బుద్ధి, అహంకారం, మనస్సు అన్నవాటి స్వాభావిక ప్రకార్యాలనూ సునిశితంగా వర్గీకరించడం జరిగింది.