ఈ పుట ఆమోదించబడ్డది

95. సైఫను మరణం -అచ 6,8-15,54–60

సైఫను ఆత్మశక్తితో చాల అద్భుతకార్యాలు చేశాడు. యూదులు అసూయతో అతన్ని బంధించి న్యాయసభ యెదుటికి కొని వచ్చారు. ఇతడు మన దేవాలయానికీ, మోషే ధర్మశాస్రానికీ వ్యతిరేకంగా మాటలాడు తున్నాడని కొందరు కూటసాక్ష్యం పలికారు. సభ అధికారులు సైఫను వైపు చూడగా అతని ముఖం దేవదూత ముఖంలాగ ప్రకాశిస్తూ వుంది. అతడు మీరు అన్యాయంగా చంపించిన యేసు దేవుని కుడిప్రక్కన నిలువబడి వున్నట్లుగా నాకు కన్పిస్తున్నాడు అని చెప్పాడు. అనగా ఉత్థాన క్రీస్తు తండ్రికి సరిసమానమని అతని భావం. యూదులు ఆ పలుకులను దేవదుషణగా భావించి, సైఫనుని నగరం వెలుపలకు నెట్టుకొనిపోయి రాళ్లతో కొట్టారు. అతడు ప్రభూ! నీవు వీళ్లపాపాన్ని మన్నించు నా ఆత్మను స్వీకరించు అనిపల్కి ప్రాణాలు విడిచాడు. సౌలుకూడ అక్కడే వుండి సైఫను హత్యను సమర్ధించాడు.

96. సౌలు క్రైస్తవులను హింసించడం -అచ 8,1-4

సైఫను మరణానంతరం యెరూషలేములోని క్రైస్తవులను క్రూరంగా హింసించారు. సౌలు యూదమతానికి వ్యతిరేకంగా క్రైస్తవమతం ప్రారంభించారు అనుకొన్నాడు. అతడు ఇంటింటజొరబడి విశ్వాసులను బయటికి ఈడ్చుకొని వచ్చి చెరలో త్రోయించాడు. చాలమంది విశ్వాసులు యెరూషలేము నుండి పారిపోయి అన్యప్రాంతాలకు వలస పోయారు. కాని వాళ్లు పోయిన తావులన్నిటిలోను సువార్తను బోధించారు. ఈ రీతిగా చాల ప్రదేశాల్లో క్రైస్తవమతం వ్యాప్తి చెందింది.

97. ఫిలిప్ప - ఇతియోపియా ఉద్యోగి -అచ 8,26-40

సైఫను మరణానంతరం వేదహింసలు ముమ్మరమయ్యాయి. సౌలు ప్రారంభించిన వేదహింసల వలన చెదరిపోయిన విశ్వాసుల్లో ఫిలిప్ప వొకడు. అతడు సమరియా మండలానికి వెళ్లి క్రీస్తుని బోధించాడు.