ఈ పుట ఆమోదించబడ్డది

నామాధికరణం

43

రఘువంశమన్నప్పుడు దాంట్లో రఘువంశకథ లేదని యెవరూ అన లేరుగదా. కనుకనే అనిశ్చితమైన ఒకగుణాన్ని స్వయంగానే తన కవ్యానికి ఆరోపించుకొని వివాదానికి అవకాశమిచ్చే సెలయేటిగానం, జడకుచ్చులు. అనే యిట్లాటిపేర్లు కావ్యాలకు పెట్టడం అత్యంతం నింధ్య మంటున్నాను. అదిగాక యీపేర్లు యేకావ్యానికి పెట్టరాదు? పెంట మాటలువ్రాసి దాన్ని జడకుచ్చు లనవచ్చును. అదేమంటే నాది నాకు బాగున్నవనవచ్చును ఇవన్నీ అవివేకపు పనులని వెనకటివైనా యిప్పటివైనా యిట్లా జడకుచ్చులు, సెలయేటిగానము అనే మాదిరిపేర్లు అప్రశస్తమని అంటున్నాను.

"శిశుక్రంద యమసభ ద్వంద్వేంద్ర జననాదిభ్యశ్ఛః"

అని పాణిని చెప్పినట్లు శిశుక్రందీయం, యమసభీయం కిరాతార్జునీయం ఇంద్రజననీయం, విరుద్ధభోజనీయం మొదలైనవీ. రఘువంశం కుమారసంభవం మొదలైనవి, పేర్లు కావ్యవస్తువును సూచించేవి మన వాఙ్మయంలో ప్రతిష్ఠితమై వున్నవి.

ఇంత ఆలోచించియే, భారతీయసాహిత్య వేత్తలు--

"కవేర్వృత్తస్య వా నామ్నా నాయకస్యేతరస్య నా" (సాహిత్య) (కవిపేరునుగాని, వృత్తంపేరునుగాని, నాయకుడి పేరును గాని, తత్సంబంధి అయిన ఇతరుడి పేరునుగానిబట్టి కావ్యానికి నామం కల్పించవలెను) అని ఆదేశిస్తున్నారు. పేర్లను క్లప్తంచేయవచ్చును.

స్వారోచిషమనుసంభవం అనడానికి మనుచరిత్ర అనవచ్చును

"సత్యభామా భామా, దేవదత్తో దత్త:" (మహా)

అని మహాభాష్యంలో పతంజలి వ్రాస్తున్నాడు. పేర్లనుగురించి వివేకం కోల్పోయి లోకాన్ని వంచించే జడకుచ్చులు మొదలైన అనుచితపు పేర్లు ఈ కాలపు కృతులకు తరుచుగా కనబడుతున్నవి.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నామాధికరణం సమాప్తం.