ఈ పుట ఆమోదించబడ్డది

268

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వికృతమైంది. ఈతీరుగాభారతవర్షంలో అధములమై భారతీయ విజ్ఞానానికి దూరులమై వంచితులమైనాము. దేశంలో భారతీయ సంస్కారప్రవాహాలు యింకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపుమాసినవి. భారతీయసంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదంగాక ఆత్మవిముఖత్వాన్ని పరసంస్కారదాస్యాన్ని మనకు ఆపాదిచినవి. ఈదశలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న కృతులు యెండునేలను మొలచిన గిటకగడ్డివలెను, యిమడక వెళ్లిపోయిన ఆహారంవలెను వుండవలసివచ్చినవి. బురదగుంట నుండి పైకివచ్చిక్షాళనానికి శుద్ధజలం లభించకతిరిగే పతితుడివలె సంకిలమైన అపరిణత బుద్ధులతో కృతుల రచనలు చేస్తున్నాము. దేశీయవిద్యాశాలలుగానీ రాజకీయవిద్యాశాలలుగానీ భారతీయసంస్కారం నిర్భంధంగా ప్రధానంగా విదేశీయసంస్కారం అంగంగా దేశీయులకు ప్రసాదించినప్పుడే యీపంకం మనకు తొలగి మనం స్వచ్ఛదీప్తితో భారతజాతుల్లో ఉత్తమస్థానం ఆక్రమించగలము. నన్నయాదుల భారతంమొదలైనవి భారతీయ సంస్కారంయొక్క శుద్ధస్వరూపం కావంటున్నాను. భారతీయ సంస్కార పరిపాకంపొంది స్వచ్ఛ దీప్తితొ భారతజాతుల్లో ఉత్తమస్థానం ఆక్రమించ గలిగినప్పటి కృతులుగాని చిత్రాలుగాని మరేమిగాని మరేవిగాని ఒక ఆంధ్రులనెగాక సర్వభారతవర్షాన్ని సర్వలోకాన్ని నూతనసందేశాలతో పవిత్రం చేయగలవు! ఆనిమిషానికే నేను ప్రతీక్షిస్తున్నాను. జన్మాంతరంలోనైనా ఆనిర్మలదశ చూడగలననే ఆశతో విశ్వాసంతో ఆంధ్రులసంస్కారానికి సేవను ఆకాంక్షిస్తున్నాను.

అనిశ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నేటికాలపుకవిత్వమనే ప్రథమాధ్యాయంలో సంస్కారాధికరణం

సమాప్తం

అధ్యాయంగూడా సమాప్తం.