ఈ పుట ఆమోదించబడ్డది

సమకాలాధికరణం

263


నిజంగా కుత్సితకవులునూ నిందించారు. భవభూతి మొదలైనవారిని నిందించిన సంగతి విదితమే గనుక వాటిని మళ్లీ ఉదాహరించలేదు.

"ఆకీర్తివర్తనీం త్వేవం కుకవిత్వవిడంబనామ్" (కా.సూ.వృ)

అని వామనుడు కుకవితను నిందిస్తున్నాడు.

"బూడిదెబుంగలైయొడలు పోడిమిదక్కి మొగంబు వెల్లనై
 వాడల వాడలందిరిగి వారును వీరును చొచ్చుచోయనన్
 గోడల గొందులందొరిగి కూయుచునుండెడి కొండవీటిలో
 గాడిదె! నీవునుంగవివిగావుగదా అనుమానమయ్యెడున్"
                                           (ప్రభాకరశాస్త్ర్యుదాహృతం!)

అని కుత్సితకవులు నిందితులవుతున్నారు. సమకాలపువారు నిందిస్తారనేదే కావ్యానికి ఒక యోగ్యతగాదు. ఇట్లా వాదించడమే సవ్యభిచార మనేహేత్వాభాసమని నైయాయికలు చెప్పుతున్నారు.

ఈహేత్వాభాసమిది. వీరు ఉత్తమకవులు సమకాలంలో నిందితులు గనుక. భవభూతి కాళిదాసాదులవలె, అని వీరివాదం. ఈవాదం తోనే అధమకవులనిగూడా తేల్చవచ్చును.

వీరు అధమకవులు. సమకాలంలో నిందితులు గనుక, కొండవీటి గాడిదెవలె ఈతీరుగా పరస్పరవిరుద్ధమైన రెండుసిద్ధాంతాలు తేలుతున్నవి. గనుక ఈవాదం హేత్వాభాసంతో కూడివున్న దన్నాను. ఇప్పటి కృతు లనేకం పులుముడు అయోమయం, చిల్లరశృంగారం మొదలైన దోషాలతో కూడినవని నేను విశదపరచాను. ఇవి ఆదోషాలతో నిండివుండ లేదని వివరిస్తే, ఆమాటలు ఉచితమైన ప్రతివచనంగా వుంటే స్వీకరిస్తాను. మళ్లీ సమాధానంవుంటే చెప్పుతాను. లేదా ఆమాటలు శిరసా వహిస్తానంటున్నాను.

అని శ్రీ..ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో సమకాలాధికరణం సమాప్తం.