ఈ పుట ఆమోదించబడ్డది

16

నవనాథచరిత్ర

వెనుక దిక్కున లేచి ◆ వెస జడ వట్టి
పలుమాఱు ముంచిన ◆ బంతంబు వచ్చెఁ
దల మని మఱియు న ◆ త్తఱిని యొండొరుల
పైఁ దళ్లు తడియంగఁ ◆ బాణియంత్రముల
నాఁదటఁ జిమ్మియు ◆ నందంద చెలఁగి
చల్లు లాడియు నవ ◆ జల జాతములను
హల్లకంబులను వేఁ ◆ ట్లాడియు నిట్లు
జలకేళి సలిపి తు ◆ షారాద్రిసుతయు
మలహరుఁడును దమ ◆ మనమునఁ దనిసి
యలసి యున్నప్పు డ ◆ య్యంబుమధ్యమునఁ
గలిసి మన్మథకేళిఁ ◆ గ్రాలుచు నున్న
మీనదంపతులును ◆ మిక్కిలి వేడ్క
పూని కనుంగొన్న ◆ భూతేశ్వరుండు
మనసిజుఁ గృపఁ జూడ ◆ మదిఁ దలంపుచును
మునుకొన్న ప్రేమల ◆ ముదురు తత్తరము
వలపు దైవారఁ బ ◆ ర్వతరాజపుత్రి
వలను జూచినఁ బ్రాణ ◆ వల్లభు తలఁపు
తెలిసి నెయ్యము మీఱ ◆ దిగ్గనఁ గదిసి
వెలయఁ గేళికి డాయ ◆ వేగిరపాటు
సరగున నప్పుడు ◆ జలములలోనఁ
దొరఁగి తేలుచునున్న ◆ తుహినాంశుధరుని
రేత మామిషబుద్ధి ◆ మ్రింగె నాలోనఁ
బ్రీతిఁ జరించెడి ◆ పెంటిమీ నొకటి
యా మత్స్యగర్భంబు ◆ నందొక్క పురుషుఁ
డా మహాదేవు వీ ◆ ర్యంబునఁ గలిగి
ప్రవిమల జ్ఞానసం ◆ పన్నుఁడై యున్న
యవసరంబున శివుఁ డా వినోదములు
సాలించి యయ్యేటి ◆ సైకతస్థలిని
బాల పల్లవ తరు ◆ పఙ్త్కి నీడలను
సేమంబు మీఱ నా ◆ సీనుఁడై యున్న
యామహాదేవుని ◆ నంబిక చేరి
పద్మాసనంబునఁ ◆ బరగఁ గూర్చుండి
పద్మాసతీ ప్రియు ◆ భావంబులోనఁ