ఈ పుట ఆమోదించబడ్డది

90

నారాయణరావు

రాజారావు స్కూలు ఫైనలు పరీక్ష చదువుచుండినప్పుడే మంచిసంబంధ మొకటి వచ్చినది. పెండ్లి వైభవముగ జరిగినది. రాజారా వింటరుపరీక్షకు బోవుటకు ముందే యాతనికి బునస్సంధానము జరిగినది. వైద్యవిద్యార్థియైన ప్రథమ సంవత్సరములో నే యుభయవంశపావనియగు కూతురు పెన్నిధివలె జనించెను.

రాజారావునకు నారాయణరావునకు చెన్నపట్టణములో స్నేహ మేర్పడినది. చిన్నతనములో రాజన్నశాస్త్రియగు నేటి రాజారావు సహజపాత్ర శీలుడు. పదిమందితో స్నేహము చేయలేడు. క్రొత్తవారితో మాటలాడలేడు. చిన్నతనమున కాకినాడలో పెద్దలతో నెట్లు మాట్లాడెనో యెట్లు వేతనము సంపాదించుకొనెనో, పెద్దవాడైన రాజారావునకు గ్రాహ్యము కాలేదు. నారాయణరావు సహజధీర స్వభావుడు గాన సభాకంప మెఱుగడు. రాజారావు పిరికివాడు. సభలో నోరెత్తలేడు.

అట్టి రాజారావును, నారాయణరావు కోమలవిలాస కాఫీహోటలులో జూచినప్పుడు పలుకరించెను. ఆనాటి నుండి స్నేహసముద్రుడైన నారాయణరావు రాజారావుగదికి వెళ్లుట ప్రారంభించియు, సినిమాలకు దీసికొని వెళ్ళియు, కాఫీహోటలులో దన స్నేహితులకు విందులిచ్చినప్పుడు రాజారావును గూడ లాగుకొని యేగియు, నాతని హృదయమును జూరగొని యించుకించుక బెదరుదీర్చినాడు.

రాజారావునకు దెలుగుకవితయందలి నేటి క్రొత్త పోకడలు రుచింపవు. స్వయ మాత డెద్దియు రచింపనేరడు గాని పురాణములు చదువుకొనుట యన బరమప్రీతి. వేదాంతగ్రంథములన్న ప్రాణమే. వివేకానంద, రామతీర్థులు, అరవిందఘోషు, జ్ఞానానంద ప్రేమానంద రాధాకృష్ణులు మొదలగు తత్వజ్ఞులు వ్రాసిన గ్రంథము లన్నియు బూర్తిగ జదివినాడు. చైతన్యుడు, రామకృష్ణ పరమహంస, హరనాథబాబా, రాధాస్వామి సత్సంగ గురువు మొదలగు వారి చరిత్రములు, బోధలు చదివినాడు.

నారాయణరావుగూడ వేదాంతవిచారమున నత్యంత ప్రీతి గలవాడు. అతడు మన పురాణేతిహాసములే గాక, వేదములు, బ్రహ్మసూత్రములు, గీత సాధు నిశ్చలదాస యోగీంద్రుని విచారసాగరము, వృత్తి ప్రభాకరముగూడ పఠించినాడు. యోగవాసిష్ఠము, జ్ఞానవాసిష్ఠము, సీతారామాంజనేయ సంవాదము, అధ్యాత్మ రామాయణము, ఉపనిషత్తులు, శంకర భాష్యము, పంచదశి మున్నగు తత్వవిచారగ్రంథముల సారమెఱింగిన వాడు. మధ్వరామానుజమతముల పరిచయము సంపాదించినాడు. బుద్ధపీఠకములు, జాతక కథలు, ధర్మపథము పరికించినాడు. జెండవిష్ణా, ఖురాను, బైబిలు, జైన సాంప్రదాయములు నవగతము చేసికొన్నాడు. కారలుమార్క్సు, నీషీ, షోపన్ హోరు, బెర్కిలీ, ఎమరుసన్ , బేకను, హాల్డేను, ఎడ్వర్డు కార్పెంటరు, టాల్ స్టాయి, రోలండు,