ఈ పుట ఆమోదించబడ్డది

84

నారాయణరావు

తప్పకుండా వస్తుంది. అప్పుడు మన కీ రాజ్యాలూ అక్కర లేదు. కళలూ అక్కర లేదు.’

‘ఒరే నారాయుడూ! నీ కీ ప్లీడరీ ఎందుకుగాని, సనాతనమత ప్రచార పీఠం ఒకటి పెట్టరా!’ అనుచు రాజేశ్వరరావు నారాయణుని వీపుతట్టి వెడలి పోయెను.

౧౯

ప్రేమస్వాతంత్య్రము

రాజేశ్వరరావు చిన్నతనమునుండియు తిరుపతిరావు గారి శిష్యకోటిలోని వాడు. తిరుపతిరావుగా రే విషయమును గూర్చి సంఘముతో దాము పోరాడుచున్నారో, స్త్రీ, పురుషు లేవిధమున సంచరించవలెనని వాదించుచున్నారో అట్లే తాము సంచరించి అకల్మష హృదయులనియు, దృఢవ్రతులనియు, ధీరచరిత్రులనియు బేరుపొందినారు. వారి యభిప్రాయములతో నేకీభవింపనివారు గూడ వారి త్రికరణశుద్ధిని మెచ్చుకొనువారే. ఆ తిరుపతిరాయునికి రాజేశ్వరుడు నమ్మిన శిష్యుడు.

తల్లిదండ్రులు వివాహము చేసికొమ్మని యెంత పోరినను, ఆతడు యెన్నో సాకులు చెప్పుచు తప్పుకొనుచుండెడి వాడు. తిరుపతిరావు గారు ఎవ్వరితోడ నబద్ధము లాడవలదనియు, ఉత్కృష్టధర్మమగు స్వతంత్ర మసత్యముచే గలుషిత మగుననియు రాజేశ్వరున కనేక విధముల బోధించినాడు.

రాజేశ్వరుడు రాజమహేంద్రవరము చదువుటకు వచ్చినపుడు నారాయణునితో ప్రాణస్నేహ మేర్పడినది. నారాయణరావు రాజేశ్వరున కెన్ని సారులో తిరుపతిరావు గారి శుశ్రూష వలదని బోధించినాడు. పరమేశ్వరరావుమాత్రము తిరుపతిరావు గారి విధానము స్త్రీ, పురుష సంబంధపు జిక్కు చక్కగా విడదీయ రాజపథము కావచ్చుననియు, కొందరి జీవితము లా విధానమునకు సమర్పితములు గావలెననియు రాజేశ్వరు డట్లేల చేయరాదనియు నారాయణరావుతో వాదించువాడు. ఆది ఆత్మహననమార్గమని మనకు తెలిసివచ్చినప్పుడు, ఆ జ్ఞానమును రెండుచేతుల ద్రోసివైచి, కళ్ళకు గంతలు కట్టుకొని, మహావిషోరగ భయంకర జీవములు గడపి, విష వాయుపూర్ణమును, నగాథము నగు నరక కూపాన నేలబడవలయునని నారాయణరావు వాదించువాడు.

తిరుపతిరావుగారి స్నేహము చేయుచుండినచో రాజేశ్వరుని మోము చూడనని నారాయణుడు అదలించినను ‘నీకు ఉడుకుబోతుతన మెందుకు? నువ్వు కూడా మాజట్టు చేరు. నువ్వూ ఘోటక బ్రహ్మచారివేగా’ అని రాజేశ్వరుడు వికటముగా జవాబిచ్చెను .