గృహమేధి
73
గారి దగ్గరకు వెడలిపోయెను. శారద యేమనుకొన్నదో యక్కడనే యాగి, ‘వదినా ఆ చిట్టిదూడ నిట్లాతీసుకు రావమ్మా’ యన్న ది. ఆ మాటకు సూరీడు మొగమింతయై దంతపుబొమ్మవలెనున్న యా పెయ్యదూడను సునాయాసముగ నెత్తికొని వదినగారికడకు గొనిపోయినది. నారాయణరావు నిట్టూర్చుచు నక్కడనుండి నెమ్మదిగా వెడలిపోయినాడు.
ఆసాయంత్రమే సుబ్బారాయుడు గారితోట జూచుటకు నాడు పెండ్లివారందరును మోటారుమీద బయలుదేరినారు. సూర్యకాంతము, సత్యవతి, పరమేశ్వరమూర్తి భార్య రుక్మిణియు వారితో వెళ్ళినారు.
తోటలో మామిడి జాతులు, బత్తాయిలు, పనసలు, పోకలు, కొబ్బరులు, జామలు, దబ్బలు, నారింజ, ఉసిరి, సపోటాలు, జంబుమలాకా, గులాబి జామ, పంపరపనాసలు, నిమ్మలు మొదలయిన వివిధ ఫలవృక్షజాతు లున్నవి. తోటలో రెండుమూడు కుటుంబముల వారు కాపురమున్నారు. తోట కన్నుల పండువై సువాసనలతో నిండియున్నది. చెట్టున బండిన కాశీజామపళ్ళు, నారాయణరావు బెంగుళూరునుండి తెప్పించిన గింజ లేని జామపళ్లు, పిండిగింజ జామపళ్ళు, సపోటాపళ్ళు, తోటమాలులు కోసి వారికెల్ల నర్పించినారు. దీపాలవేళకు మోటారింటికి దిరిగివచ్చినది.
నారాయణరావున కేదియో వ్యక్తము గానిభయ మొండు హృదయమున బ్రవేశించినది. శారదవర్తనమునం దేదియో విశేషభావ ముండునని యాతడనుకొనెను. ఛీ! తప్పు. అది భారతీయ నారీమణులకు సహజమగులజ్జ యని మనస్సును సమాధాన పరచుకొనెను.
నారా: పరం! మన స్త్రీ లెంత పాశ్చాత్యవిద్యావంతులైనా, వారికి పాశ్చాత్య నాగరికతా వాసన లెంత యలముకొన్నా, భారతీయ సంప్రదాయ వాసన వారిజీవితాన్ని వదలి పెట్టదురా!
పరం: ఏం, ఆ ఆలోచన కల్గింది? ఎవరైనా కనపడ్డారా ఏమిటిరా పెద్దచదువు చదివి భారతీయ సంప్రదాయాలున్న వాళ్ళు, ఇవాళ?
నారా: ఒక ఆలోచన్లోంచి ఇంకోటితట్టిన వరుసలో ఆఖరుఆలోచనఇది.
పరం: ఆ గొలుసుకు మొదటిలంకె ఎక్కడ మొదలెట్టిందేమిటి?
నారా: అదేముంటుంది లే, ఏదో చిన్న ఆలోచన!
పరం: అయినా, మనస్తత్వ పరిశోధనకోసం అడుగుతున్నాను.
నారా: నేను చెప్పింది తప్పా?
ఇంతలో లక్ష్మీపతి అక్కడకు వచ్చినాడు.
లక్ష్మీ: ఏమిట్రా వాదించుకుంటున్నారు?
పరం: చూడరా, వీడు ఒక పెద్ద సిద్ధాంతం చేశాడు. నువ్వు వప్పుకుంటావా, వప్పుకోవా? అంటాడు. సరేరా, నీ సిద్ధాంతానికి ఉపపత్తులైన మొదటి ఆలోచన లేమిటిరా అంటే, వీడు ఇవీ అవీ చెప్పి తప్పించుకుంటాడు.