ఈ పుట ఆమోదించబడ్డది

72

నారాయణరావు

బండ్ల కుపయోగించునవి కలవు. రెండుజతల బొబ్బిలిపోతులు, మూడు జతల బండిపోతులు, సంతతము వారికడ నుండవలెను. దొడ్డిలో గాపురమున్న వాని పిల్లలే పసుల కాపరులు.

మనుష్యులు పస్తుండినను, దూడలకు మేత తప్పగూడదని సుబ్బారాయుడు గారి మతము. వట్టిగడ్డి, జనుము దంటు, జొన్న చొప్ప, చిట్టు, తవుడు, ఉలవలు, సమస్తము సుబ్బారాయుడు గారి యింటిలో బుష్కలముగా నుండవలెను. పచ్చగడ్డి మేతకై పదియెకరములభూమిలో బిల్లిపెసర పెంచెదరు. బీటి నేలకూడ బుష్కలముగా నుండుటచే వారికి బశుగ్రాసలోపమెన్నడు నుండెడిది కాదు.

సుబ్బారాయుడు గారికి బాడిపశువులు విస్తారమున్నవి. ఒంగోలు ఆవులు ఎనిమిది, దేశవాళీ ఆవులు పన్నెండు గలవు. అయిదు పెద్ద గేదెలున్నవి. కొన్ని పాడిపశువులు, కొన్ని చూడివి, కొన్ని వట్టిపోయినవి. వారింట సర్వకాలముల పాడి పుష్కలముగా నుండవలెను. పాడిదూడలు గాక, వారింట గుమ్మడిపండావులని యొక జాతి కలదు. సుబ్బారాయుడు గారి తాతగా రాజాతి నేక్కడనుండి సముపార్జించిరో? ఆవు రెండడుగులన్నరయెత్తు, చిన్న తల, లేడికళ్ళు, పాల సముద్రమువంటి తెల్లని యొడలు, రేపు శేరు మాపు శేరు పాలిచ్చు కుండ పొదుగుతో గామధేనువువలె ముచ్చటగా నుండును. ఆ గుమ్మడిపండావు దూడ కడుచిన్నదియై బొమ్మదూడవలె ముద్దులు మూటగట్టుచుండును.

వనలక్ష్ములవలె నున్న శారదా, సూర్యకాంతములతో నేగు నారాయణ రావు త్రోవలోని మొక్కలను వర్ణించి చెప్పుచు, బాడి పశువుల పాకయున్న దొడ్డిలోని కేగెను. ఆ పెద్దపాకలో నొక ప్రక్క గుమ్మడిపండావులు రెండున్నవి. ఒకటి పాలిచ్చుచున్నది; రెండవది వట్టిపోయినది. తన్ను చూడగానే చెంగు చెంగున గంతులిడుచు చేరవచ్చిన దూడను నారాయణరావు ముద్దులాడ దొడగెను. పనుల త్రొక్కిడిచే రొచ్చు గానున్న యాదొడ్డిని గాంచి ఏవగించు కొనుచున్న శారదకు, భర్త దూడనెత్తి ముద్దులాడుట మీదు మిక్కిలియై —‘వదినా యింటిలోకి వెళ్ళిపోదాం రావమ్మా’ యని వెనుకకు తిరిగి, మగని యెడ్డెతనమును గూర్చిన తలపులతో నింటిదెసకు నడువసాగెను. శారదాచిత్తవృత్తి యెరుంగని సూర్యకాంతము ఆమె వెనుకనే పరువిడి, యామెకడ్డముగ నిలువబడి ‘ఏవమ్మా వదినా, ఏమిటి! గుమ్మడిపండు దూడనుజూడకుండగనే వెళ్ళిపోతున్నా వేమిటి? రా!’ అని పిలిచినది. ‘చూస్తూ నేవున్నా గదా’ యన్నది శారద.

అంతకుమున్నే వికలమనస్కుడైయున్న నారాయణరావు శారద వింతవర్తనమున కింకను నొచ్చుకొనుచు, ఆమెను వెనుకకు గొని తెచ్చుటకు నిర్బంధించు చెల్లెలితో ‘సూర్యం! నువ్వు ఇల్లారా! ఇది కబురులు చెపుతోంది చూశావా! దీనికి ‘వరబాల’ అని నాన్న గారు పేరు పెట్టారా?’ అనినాడు. సూర్యకాంతము తలవంచికొనియున్న వదిన దెస కొకపరియు, లేని వికాసము దెచ్చుకొను అన్నదెస కొకపరియు జూడ్కి ప్రసరించి నిట్టూర్పువదలి యన్న