68
నా రా య ణ రా వు
ఆనాడు బాలికలిద్దరు వనసంచార మొనర్చునప్పడు నారాయణరావు చూచినాడు. ఆతని బ్రతు కప్పుడు సువాసనాలహరీస్నాతయైన ట్లయినది. ఆ యిరువురు బాలికలను దన యిరుసేతుల నెత్తి ముద్దాడ నువ్విళులూరినాడు. ప్రపంచమంతయు నాతనికి ప్రేమస్నాతమయినట్లు తోచినది.
చల్లని యడుగులతో వారిరువుర నాతడు డాసి ‘సూరీడూ! ఈతోటంతా చూపిస్తున్నావుటే’ అని పలకరించినాడు. పలుకరించి, తన చొరవకు దానే యక్కజంపడినాడు.
కులుకుమిటారియగు తన శారదతో మాటలాడవలెనని పెండ్లి రెండవనాడే యాతనికి గోర్కె వొడమినది. కాని సిగ్గుపెంపున మాటలాడింపలేడయ్యెను. ఎట్టి సభలోనైన పులకలు పుట్టించు గంభీర స్వరమున నుపన్యాసము లిచ్చు నారాయణరావా ముహూర్తమున త్రపావశుడైనాడు. మఱునాడుదయమున మోటారులో భార్యాసమేతుడై యూరేగునప్పుడు ‘నీకు కాలేజీలో చేరి చదవాలని ఉన్నదా’ యని యెట్లో ప్రశ్నించినాడు.
శారద యాశ్చర్యపూరితయైనది. ఆమెకు నాగరిక మర్యాదలన్న నెంతయు నిష్టమే. తానంతకుమున్ను చూడబోయిన వివాహములందు నూతన వధూవరులు మాటలాడుకొనుట చూచినది. సంతోషము నొందినది. అటులనే తానును మాటలాడగలనని తలంచి లజ్జాకవోష్ణమై మోము కెంపెక్క జిరునవ్వు పెదవులు దాటకుండ నప్పలించుకొన్నది. నేడు భర్త తన్నట్లు మాట్లాడించునని యామె కలనైన తలపోయలేదు. తొలినాడు తన్ను జూడ వచ్చిన నారాయణ రావును నిర్భయముగ జూచినది. అపుడపుడే పరిమళమలముకొను హృదయమున నారాయణరావును మెచ్చుకొన్నది. అతని రూపసంపద శారద మనస్సును గలకలలాడించినది. నారాయణరావు ఫిడేలుపై మధురముగా గానము చేసినప్పు డాశ్చర్యము, నానందము నామె నలముకొనియెను.
సంబంధము నిశ్చయమైనదని తెలిసినప్పటి నుండియు దల్లియగు వరదకామేశ్వరీ దేవి శారద చెవికడ నిల్లుగట్టుకొని విచారించినది. పల్లెటూరి సంబంధము ఘటించిన భగవంతుని తీవ్రముగా దూలనాడినది. తనకును శారదకును గ్రహచారమున్నట్లున్నదని కంటనీరు పెట్టుకొనినది. చుట్టములలో స్త్రీలు ఒకరిరువురు తప్ప మిగిలిన వారట్టి సంబంధము నిశ్చయమైనందుల కక్కజమందుచు వరదకామేశ్వరీ దేవితోపాటు విచారించినారు. ఆ సంబంధమును నిందించినారు.
శారద లేత హృదయమున నామాటలెల గాటముగ నాటికొని ప్రత్యక్షమైన స్వామియెడ నిరసన భావమును, వైముఖ్యమును మొలకెత్తించినవి. అట్టి మనస్థితిలో నున్న శారదను నారాయణరావు పలుకరించినప్పుడామె యించుక యులికిపడినదనిన వింత యేమి!