ఈ పుట ఆమోదించబడ్డది

గృ హ ప్ర వే శ ము

67

 ఆ సాయంత్రము చల్లని గాలులు వీచుచు మల్లెమొగ్గల సౌరభ మెల్ల యెడల జల్లుచుండెను. నిన్ననే సూర్యకాంతం వదిన గారికి దమ యింటి వెనుక తోట జూపించినది. మల్లెజాతులు, సన్న జాజులు, గులాబుల కుటుంబములు, సంపంగెలు, జాజులు, మందారముల రకములు, ఏవేవో కొత్తరకముల పూవులు దొడ్డియంతయు నావరించి బారులుతీర్చి గీతములు పాడుకొనుచున్నవి. నారాయణ రావుకు దోటపనియన్న బ్రాణము. తాను సెలవలకు వచ్చినప్పుడు కొత్తకొత్త రకముల పూలచెట్లు నాటుచుండును. అంట్లు కట్టుట చిగురుల నంటుకట్టుట, కొమ్మలు కత్తిరించి వానికి జీవముపోయుట, మొక్కలలో క్రొత్త జాతులను సృజించుట మున్నగు పను లాత డవలీలగ జేయగలడు. అతనికి స్నేహితులు తోటమాలి యనికూడ బేరుపెట్టినారు.

అతడు మొక్కలతో మాట్లాడుకొనును. అతని హస్తస్పర్శకు, జల్లని మాటలకు జెట్లు సంతోషమున బొంగిపోవును. ‘బోసు చెప్పినదానిలో ఇంతైనా అతిశయోక్తి లేదురా’ అని స్నేహితులతో ననువాడు నారాయణరావు. గ్రాండిఫ్లోరా పూలచెట్లొక వరుసయును, చామంతి జాతు లొక బారును లెజిస్త్రోమియాలు వివిధవర్ణముల పూలతో నొకవంక ను గలకలలాడిపోవుచున్నవి. ఇంకను నేవేవో రకముల పూలట! భరత ఖండములో నెక్కడ పెరుగునదియైన నారాయణరావు దాని నెంత ఖరీదునకైన తెప్పించి తోటలో పెంచుచుండును.

సింహాచలము సంపెంగలు_పచ్చ, తెలుపు జాతులవి కలవు. కనంగ సంపెంగ, కర్పూర సంపెంగ, సకలగుణ సంపెంగ, తీగ సంపెంగ యాతని ముద్దుబిడ్డలు. ఎడ్వర్డు, కార్లైన్ డిఆర్డెను, ధవళమగు నమెరికా సుందరి, పాలెనీరాను మొదలగు నెనుబది రకముల గులాబుల ప్రాణప్రదముగా బెంచినాడు. బొడ్డుమల్లె, జంటమల్లె, పొదమల్లె, పందిరిమల్లె, చిరుమల్లె, కాకినాడమల్లెలు నక్షత్రము వలె విరిసి యాతని కన్నుల నార్ద్రములు సేయును. చెన్నపట్టణపు బొడ్డు చేమంతి, తెల్లచేమంతి చిన్నది, సాదారకము బొత్తాము చేమంతి, నీలపు చేమంతి, ఎఱ్ఱ చేమంతి, అరచేతి పెద్ద జాతి చేమంతులు నాతని జీవితమున దీపులూరజేయును. కదంబము కలదు, పన్నీరు వృక్షము లున్నవి, దేవపారిజాతము లున్నవి, పూవుదానిమ్మ లున్నవి.

సూర్యకాంతము చిన్నన్న గారి యుత్సాహములో తానును మునిగిపోవును. అన్నగారు చదువునకు పోయినప్పుడు తోటమాలితనము తన్నావరించినట్లు భావించుకొనును. తోటమాలులచే నీరు బోయించును. ఇవక పట్టనీయక కాపాడునట్లు చేయును. ఉద్యానవన బాలికయై యన్న గారి యాజ్ఞ పాలింపు చుంటినని గర్వమునొందును. ఆమె వనదేవతయే యయిపోవును.

శారద యా వనము చూచి ఆశ్చర్యమందెను. కొంచె మసూయ ఆమె లేత హృదయము నలమినది.